జర్నలిస్ట్‌ రాణా ఆయూబ్‌పై ఈడీ చార్జిషీట్‌

జర్నలిస్ట్‌ రాణా ఆయూబ్‌పై మనీలాండింగ్‌ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  ఘజియాబాద్‌లో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. గతేడాది ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. 

కెట్టో.కామ్ వెబ్‌సైట్ ద్వారా దాతృత్వం పేరుతో సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆమెపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ ఫిబ్రవరి నెలలో రూ. 1.77 కోట్లను జప్తు చేసింది. ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ అయిన కెట్టో ద్వారా మూడుసార్లు విరాళాలు సేకరించిందని ఈడీ ఆరోపించింది.

గ్లోబల్ మీడియా హౌస్‌కు ఆర్టిక‌ల్స్ రాసే జర్నలిస్ట్‌ రాణా అయ్యూబ్.. కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేయాలన్న సాకుతో పెద్ద మొత్తంలో నిధులు సేకరించి తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసినట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. 

రాణా అయ్యూబ్ ఈ నిధులను దుర్వినియోగం చేశారని, వ్యక్తిగత ఖర్చుల కోసం నిధుల‌ను మరో ఖాతాలోకి మళ్లించినట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు.  వికాస్‌ సాంకృత్యాయన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్లోని ఇందిరాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

అసోం, బిహార్‌, మహారాష్ట్రల్లో వచ్చిన వరదల సమయంలో సహాయక చర్యలు, కరోనా కష్టకాలంలో దేశంలో కరోనా కష్టకాలంలో బాధితులకు సహాయం అందించేందుకు 2020-21 మధ్యకాలంలో కెట్టో అనే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 2.69 కోట్లకుపైగా విరాళాలు సేకరించి, నిబంధనలు ఉల్లంఘించారని గుర్తించారు. వీటిలో దాదాపు రూ.80.49 లక్షలు విదేశీ కరెన్సీ రూపంలో అందుకున్నట్లు వెల్లడైనది. 

అయితే, కెట్టో ద్వారా సేకరించిన ప్రతి పైసాకు లెక్క ఉందని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని జర్నలిస్ట్‌ రాణా ఆయూబ్‌ తెలిపింది. కానీ,  పూర్తిగా ముందస్తు ప్రణాళికతో, క్రమపద్ధతిలో స్వచ్ఛంధ సంస్థ పేరుతో నిధులు సేకరించారని, వాటిని పూర్తిగా ఉపయోగించలేదని ఈడీ ఆరోపిస్తున్నది.

విరాళాలను కుటుంబ సభ్యులు, వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేశారని, కేవలం రూ.29 లక్షలు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, సహాయక పనులు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదం, రిజిస్ట్రేషన్‌ లేకుండా విదేశాల నుంచి విరాళాలను స్వీకరించారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది.