భారత్ అమలు చేస్తున్న నేరుగా నగదు బదిలీ పథకం, ఇతర సామాజిక సంక్షేమ పథకాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ‘లాజిస్టికల్ అద్భుతాలు’గా అభివర్ణించింది. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని ఐఎంఎఫ్ అంటూ, ఈ విషయంలో భారత్ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అభిప్రాయపడింది.
వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు, సబ్సిడీలను సమర్థవంతంగా, పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లోకి సకాలంలో బదిలీ చేయడంతో పాటుగా మధ్య దళారీల పాత్రను పూర్తిగా తొలగించడం ఈ నేరుగా నగదు బదిలీ(డిబిటి) పథకం ముఖ్య ఉద్దేశం.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2013 నుంచి ఈ పథకాన్ని ఉపయోగించి రూ.24.8 లక్షల కోట్లను బదిలీ చేయడం జరిగింది. ఒక్క 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే రూ.6.3లక్షల కోట్లను బదిలీ చేయడం జరిగింది. అంటే సగటున రోజుకు 90 లక్షలకు పైగా నేరుగా నగదు బదిలీ చెల్లింపులు జరిగాయని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఐఎంఎఫ్ ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పావ్‌లో మావ్‌రో వాషింగ్టన్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అంత పెద్ద దేశంలో తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది ప్రజలకు నగదు బదిలీ స్కీమ్‌ను నిర్వహిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. ఈ స్కీమ్‌ను భారత ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
భారత్‌లాంటి సువిశాలమైన దేశంలో తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కోట్లాది మంది లబ్ధిదారులకు ఈ పథకాల లబ్ధి నేరుగా అందజేయడం నిజంగా ఓ అద్భుతమేనని భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
ముఖ్యంగా మహిళలు, వయోవృద్ధులు, రైతులు ఇలాఅన్ని వర్గాలకు చెందిన కార్యక్రమాలు దీనిలో ఉన్నాయని, ఈ ఉదాహరణల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బోలెడంత సాంకేతిక ఆవిష్కరణ ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్ విషయంలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రత్యేక గుర్తింపు విధానం ‘ఆధార్’ను అద్భుతంగా ఉపయోగించుకోవడం అని మౌరో చెప్పారు.
మహిళలను టార్గెట్ చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయని, వృద్ధులను, రైతులను ఉద్దేశిస్తూ కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతోందని పేర్కొంటూ ఈ పథకాల నిర్వహణలో ఎంతో సాంకేతిక ఆవిష్కరణ కూడా ఇమిడి ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది సంస్థాగత, ప్రణాళిక సంబంధిత అద్భుతమని వివరించారు.
ఇతర దేశాల్లో కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ప్రజలకు సొమ్మును పంపించే పథకాలు ఉన్నాయని చెబుతూ అక్కడి ప్రజలకు పెద్దగా స్తోమత లేకపోయినా సెల్‌ఫోన్ ఉంటుందని తెలిపారు.
నూతన సాంకేతిక విధానాలను అమలు చేసే విషయంలో ఐఎంఎఫ్ భారత్‌తో కలిసి పని చేస్తోందని ఆర్థిక వ్యవహారాల విభాగం డైరెక్టర్ విటార్ గాస్పర్ అంటూ లక్షిత వర్గాలకు చెందిన సంక్లిష్ట సమస్యలను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించడంలో భారత్ ఒక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. ప్రజలకు పథకాలను చేరవేసే విషయంలో టెక్నాలజీని భారత్ వాడుకుంటున్న తీరు స్పూర్తిదాయంగా ఉందని చెప్పారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం
అమెరికా చదువులపై భారత విద్యార్థుల అనాసక్తి