గుజరాత్ లో మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుస్తాం 

గుజరాత్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుపొంది అధికార బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రజలు చాలా కాలంగా బిజెపిని విశ్వసిస్తున్నారని, వారి కోరికలను పార్టీ నెరవేర్చిందని ఆయన చెప్పారు.

గుజరాత్ గౌరవ్ యాత్ర మూడవ దశను  గౌరవ్ యాత్రకు పచ్చజెండా చూపి ప్రారంభించే ముందు అహ్మదాబాద్ జిల్లాలోని జంజారాకాలోని ప్రముఖ మత స్థలమైన సంత్ సవయ్యనాథ్ ధామ్‌లో జరిగిన బహిరంగ సభలో షా ప్రసంగించారు. గిర్-సోమ్‌నాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయం వద్ద గౌరవ్  యాత్ర ముగుస్తుంది.

“ఈ రోజు నేను ఈ జర్నలిస్టులందరి సమక్షంలో చెబుతున్నాను, 2022లో మూడింట రెండొంతుల మెజారిటీతో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని. గుజరాత్ ప్రజలు బిజెపిపై విశ్వాసం ఉంచారు, బిజెపి దానిని (వారి కోరికలను) పూర్తిగా నెరవేర్చింది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నెహ్రూ కశ్మీర్ సమస్యను సృష్టించారని, ఏళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ  దీనిని పరిష్కరించారని ఆయన చెప్పారు. ప్రధాని నెహ్రూ ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టి ప్రత్యేకతను సంతరింపచేయడం వల్లనే ఆ తర్వాత కశ్మీర్ సమస్య సంక్షోభానికి దారితీసిందని ఆయన ఆరోపించారు. అయితే జటిల సమస్య మూలాలను గ్రహించి ప్రధాని మోదీ  దీనిని తొలిగించివేసి సమస్యను పరిష్కరించారని కితాబు ఇచ్చారు.

నెహ్రు అనాలోచిత చర్యతోనే కశ్మీర్ కొలిమి అంటుకుందని, ఏళ్ల తరబడి రగులుకుని అక్కడనే కాకుండా జాతీయ స్థాయిలో సంక్షోభానికి దారితీసిందని హోంమంత్రి విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370 వద్దని చెప్పారు. అయితే ఈ దిశలో అన్ని చర్యలు తీసుకుని ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఘనత, కశ్మీర్‌ను దేశంలో పూర్తి స్థాయిలో అనుసంధానం చేసిన ఖ్యాతి ప్రధానికే చెందుతుందని స్పష్టం చేశారు. 

బిజెపి సారధ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మాణం చేపట్టేందుకు బిజెపి ఉద్యమించినప్పుడు కాంగ్రెస్ తిట్టి పోసిందని, అయితే తాము దీక్షతో వెళ్లడంతో రామాలయ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు జనానికి ఆకాంక్షలకు అనుగుణమైన రామాలయం ముందుకు రానుందని అమిత్ షా తెలిపారు. 

అయోధ్య రామమందిర నిర్మాణం కూడా చిన్న పని కాదని, అయితే అసాధ్యాన్ని బిజెపి సుసాధ్యం చేసిందని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో కర్ఫూలు పరిపాటి అయ్యాయని, అయితే మోదీ  అధికార క్రమంతో ఆ పీడరోజులు పొయ్యాయని ఆయన తెలిపారు.