నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశంలో  ప్రకటించారు. కరోనా మహమ్మారి ఆందోళన ఇక లేదని చెప్పారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు నవంబరు 12న జరుగుతాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న జరుగుతుందని తెలిపారు.
దీనికి సంబంధించి అక్టోబ‌ర్ 17న నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. అభ్యర్థులు ఈ నెల 17 నుంచి నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చునని, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 25 అని, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29 అని తెలిపారు. 

తొలిసారి ఓటు హక్కు పొందినవారి సంఖ్య 1.86 లక్షలని, 80 ఏళ్ల వయసు పైబడిన ఓటర్ల సంఖ్య 1.22 లక్షలని తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య 55 లక్షలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన బూటకపు వార్తలు, వదంతులపై నిఘా పెట్టేందుకు సామాజిక మాధ్యమాల బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 80 ఏళ్ళ వయసు పైబడినవారు, అదేవిధంగా 40 శాతం పైబడిన అంగవైకల్యంగలవారు తమ ఇంటి వద్ద నుంచే ఓటు వేయవచ్చునని చెప్పారు.

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ బీజేపీ నుంచి 45 మంది, కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇత‌రులు ముగ్గురు ఉన్నారు.  2023 జ‌న‌వరి 8న హిమాచ‌ల్‌లో ప్ర‌స్తుత అసెంబ్లీ గ‌డువు ముగియ‌నుండ‌టంతో ఈసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే 1985 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఏ ఒక్క పార్టీ కూడా వ‌రుస‌గా రెండు సార్లు గెలువ‌లేదు.

కాగా,  గుజరాత్ అసెంబ్లీ గడువు 2023 ఫిబ్రవరి 18తో ముగియనున్నందున ఈ ఏడాది చివరలోనే ఎన్నికలు నిర్వహించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో ఎన్డీఏ బలం 111కు చేరింది.