అవినీతి కేసులో మ‌రో ఆర్జేడీ ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త వేటు

అవినీతి కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్నిపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. 2012లో విమాన ప్ర‌యాణం చేయ‌క‌పోయినా త‌ప్పుడు ఎయిరిండియా ఈ-టికెట్స్‌ను స‌మ‌ర్పించి రూ.23.71 ల‌క్ష‌ల‌ ట్రావెలింగ్ అల‌వెన్స్ కాజేసేందుకు అనిల్ సాహ్ని ప్ర‌య‌త్నించారు. నాడు జేడీయూ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ఆయ‌న‌పై కేసు న‌మోదైంది.

అప్ప‌టి నుంచి సీబీఐ కోర్టులో ఈ కేసు విచార‌ణ జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 29న న్యాయ‌స్థానం అనిల్ సాహ్నిని దోషిగా తేల్చింది. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కు అంటే ఆగ‌స్టు 31న సాహ్నికి మూడేండ్ల జైలు శిక్ష విధించింది. దాంతో బీహార్ అసెంబ్లీ సెక్రెట‌రీ ప‌వ‌న్ కుమార్  ఖుర్హాని ఎమ్మెల్యే అనిల్ సాహ్నిపై అన‌ర్హ‌త వేటు వేసిన‌ట్లు శుక్ర‌వారం ప్ర‌క‌టించారు.

ఈ అన‌ర్హ‌త అనిల్ సాహ్నిని కోర్టు దోషిగా తేల్చిన తేదీ నుంచి వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. కాగా, అనిల్ సాహ్ని కంటే ముందు మ‌రో అర్జేడీ ఎమ్మెల్యేపై కూడా అన‌ర్హ‌త వేటు వేశారు. త‌న ఇంట్లో మార‌ణాయుధాలు, పేలుడు ప‌దార్థాలు ల‌భ్య‌మైన కేసులో ప‌ట్నా కోర్టు మొకామా ఎమ్మెల్యే అనంత్‌కుమార్ సింగ్‌ను దోషిగా తేల్చింది. దాంతో ఆయ‌న శాస‌స‌భ్య‌త్వం ర‌ద్ద‌య్యింది.