ఇంధన భద్రత, హరిత పరివర్తనకు భారత్ ఇంధన ప్రణాళిక

ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా  ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఇంధన భద్రత కల్పించి హరిత పరివర్తనకు అనుగుణంగా భారతదేశ  ఇంధన ప్రణాళిక రూపుదిద్దుకుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి  హర్దీప్ ఎస్. పూరి తెలిపారు. 
 
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో “భారత్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో అవకాశాలు” అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ  కర్బన ఉద్గారాలు తగ్గించే హైడ్రోజన్ జీవ ఇంధన వనరుల వినియోగానికి భారతదేశం ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి వివరించారు. 
 
ప్రస్తుతం ఇంధన రంగంలో  అనేక సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయని,  అయితే, సవాళ్లు, సమస్యలు  ఉన్నప్పటికీ ఇంధన పరివర్తన, వాతావరణ పరిరక్షణ కోసం నిర్ణయించుకున్న లక్ష్యాల సాధన పట్ల భారతదేశం రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిర్ణయించుకున్న లక్ష్యాలను భారతదేశం చేరుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు. 
 
రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచ ఇంధన అవసరాలు పెరుగుతాయని చెబుతూ  భారతదేశంలో  25% మేరకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇంధన వనరుల అన్వేషణ, ఉత్పత్తిని ప్రోత్సహించి హేతుబద్ధీకరించడానికి  భారతదేశం ప్రధాన సంస్కరణలను అమలు చేస్తున్నదని  వివరించారు.  
 
నిషేధిత ప్రాంతాలను 99% వరకు తగ్గించి,  1 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు.  నేషనల్ డిపాజిటరీ రిజిస్ట్రీ మొదలైన వాటి ద్వారా  నాణ్యమైన జియోలాజికల్ సమాచారాన్ని  అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.  అన్వేషణ, ఉత్పత్తి రంగానికి  ప్రోత్సాహం అందించాలన్న నిర్ణయంలో భాగంగా  ప్రపంచ చమురు, గ్యాస్ రాజధాని (హ్యూస్టన్)లో ప్రత్యేక కోల్-బెడ్ మీథేన్ (సిబిఎం) రౌండ్,  ఆఫ్‌షోర్ వేలం పాటను ప్రారంభించింది. దీనిలో  2.3 చదరపు లక్షల కి.మీ.  1 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నో గో ప్రాంతాలను వేలం కోసం  ఉంచారు.

జీవ ఇంధనాలు, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ హైడ్రోజన్, పెట్రోకెమికల్స్, అప్‌స్ట్రీమ్ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరింత పెరగడానికి అవకాశం ఉందని హర్దీప్ ఎస్.పూరి పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన  ప్రైవేటు రంగ సంస్థల సహకారంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని తెలిపారు.  “మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న  సంస్కరణ వల్ల భారతదేశంలో చమురు అన్వేషణ, ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనడానికి  ఆసక్తి కనబరుస్తున్నాయి” అని ఆయన ట్వీట్ చేశారు. 

భారతదేశానికి సాంప్రదాయ ఇంధన వనరులు, నూతన ఇంధన వనరుల రంగంలో భారతదేశానికి  అత్యుత్తమ-తరగతి సాంకేతికతలను అందించడానికి, భారతదేశంతో మరిన్ని ఒప్పందాలను కుదుర్చుకోవడానికి సమావేశానికి హాజరైన ప్రతినిధులు అంగీకరించారు.