క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌కు అణుధార్మిక ముప్పు!

తొమ్మిది నెలలుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం అందరూ భయపడుతున్నట్లు  చివరకు అణు పెను ముప్పు వైపు దారితీస్తోంది. క్రైమియా బ్రిడ్జి పేల్చివేత ఘటనతో ప్రతీకారంతో రగిలిపోతున్న రష్యా ఉక్రెయిన్‌పై భీకర క్షిపణులతో దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో జపోరిజజియా అణుకేంద్రం ఎనర్గో ఆటమ్ అత్యంత శక్తివంతం అయిన క్షిపణులతో రష్యా జరిపిన దాడి విలయానికి దారితీసింది. 

ఈ ప్లాంట్‌కు పూర్తి స్థాయిలో బయటి నుంచి అందే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఐదు రోజులలో రెండు సార్లు ఈ విధంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అణుధార్మికత ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. 

అణుకేంద్రంలోని కీలక అత్యంత సునిశిత భద్రతా యంత్రాలు, వ్యవస్థలకు నిరంతర విద్యుత్ అవసరం అని, లేకపోతే రేడియేషన్ ప్రభావం బయటి ప్రాంతాలకు చేరుకుంటుందని ఉక్రెయిన్ న్యూక్లియర్ వ్యవహారాల ఉన్నతాధికారి ఒకరు  ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా ఆధీనంలోకి వచ్చినట్లే వచ్చి చేజారిన జపోరిజజియా ప్రాంతం తిరిగి కైవసం చేసుకునేందుకు రష్యా భీకరంగా స్పందిస్తోంది.

రష్యా యత్నాలను ఢీకొనేందుకు మరో వైపు ఐరోపా దేశాలు కొన్ని నేరుగా ఉక్రెయిన్‌కు ధీటైన ఆయుధ వ్యవస్థను సమకూర్చేందుకు సిద్ధం అవుతున్నాయి. రష్యా దాడులతో ఈ ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోయి బ్లాకౌట్ పరిస్థితి ఏర్పడింది. ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్‌ను మిస్సైల్ ఢీకొనడంతో ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. 

పునరుద్ధరణ పనులకు అడ్డంకిగా నిరంతరాయంగా రష్యా దాడులు సాగుతున్నాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకాలతో అణుకేంద్రం పరిస్థితి గందరగోళంలో పడింది. వరుసగా ఈ ప్లాంట్‌లోని వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో రేడియేషన్ ప్రభావం ఏర్పడుతోందని హెచ్చరికలు వెలువడ్డాయి. 

ఇంతకు ముందు ఇక్కడ ఆరు రియాక్టర్లు ఆగిపొయ్యాయి. ఐరోపాలోని అతి పెద్ద ఈ న్యూక్లియర్ ప్లాంట్‌లో యంత్రాలు వేడెక్కకుండా అందులోని అణు పదార్థాలు కరిగిపోయి రేడియేషన్ జరగకుండా చేయాలంటే విద్యుత్ సరఫరా అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ లేకపోవడంతో దీనిని పనిచేయించేందుకు డీజిల్ ట్యాంకులు తరలివస్తున్నాయి. అయితే రష్యా దళాలు ఈ ట్యాంకుల కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నాయి.

ఐరోపాలో తీవ్రస్థాయికి విద్యుత్తు సంక్షోభం
 
మరోవంక, ఐరోపా దేశాలన్నీ విద్యుత్ సంక్షోభంలోకి వెళ్తున్నాయి. 50 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్తు కోతలు విధించేందుకు బ్రిటన్‌ సర్కారు సిద్ధమవుతున్నది. యూకేలో 40 శాతానికి పైగా గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఆ గ్యాస్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకొనేది. 
 
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. దానికి ప్రతీకారంగా రష్యా ఐరోపా దేశాలకు గ్యాస్‌ సరఫరాను నిలిపివేసింది. దీంతో ఈయూలో గ్యాస్‌ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌ సహా ఐరోపా దేశాలు తీవ్ర విద్యుత్తు సమస్యను ఎదుర్కొంటున్నాయి.
 
70 ఏండ్లలో ఎన్నడూ చూడని విద్యుత్తు కరువును ఇటలీ ఎదుర్కొంటున్నది. ఐరోపా బ్యాటరీగా పేర్కొంటున్న నార్వే రిజర్వాయర్లు కూడా సగం ఖాళీ అయ్యాయి. కాగా, శీతాకాలంలో కరెంటు కష్టాలు ఉంటాయని, వచ్చే ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని ఇప్పటికే యూకే నేషనల్‌ గ్రిడ్‌ స్పష్టం చేసింది. నిల్వ చేసిన లిక్విడ్‌ గ్యాస్‌ మొత్తం అయిపోతే శీతాకాలంలో ప్రతిరోజూ పవర్‌ కట్‌ ఉండొచ్చని చెప్తున్నది.
 
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే ఆయిల్‌ ధరలపై నియంత్రణ విధించేందుకు ఐరోపా దేశాలు సమావేశమయ్యాయి. ఈ నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పందిస్తూ నియంత్రణ విధించాలనుకోవటం ‘కోట్ల మంది ప్రజల (ఐరోపా ప్రజల) బాగోగులను తుంగలో తొక్కటమే’ అని హెచ్చరించారు. గ్యాస్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు సిద్ధంగానే ఉన్నామని, అయితే, తక్కువ ధరకు మాత్రం అమ్మబోమని ఆయన స్పష్టం చేశారు.