అమెరికా- ఇరాన్ కలిసి హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు

అమెరికా- ఇరాన్ కలిసి హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
హోర్ముజ్ జలసంధి నుండి మైన్‌లను తొలగించడానికి అమెరికా ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గత వారం, న్యూయార్క్ టైమ్స్ నివేదించిన ప్రకారం, యుద్ధం మధ్యలో రాకపోకలను అడ్డుకోవడానికి జలమార్గంలో వేసిన అన్ని మైన్‌లను గుర్తించలేకపోవడం వల్ల ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవలేకపోయింది. 
 
హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకా రవాణాను విస్తరించే అవకాశం ఉన్న ఒక చర్యలో, అమెరికా సహాయంతో ఇరాన్ ఆ జలమార్గం నుండి సముద్ర మైన్‌లను తొలగిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ట్రంప్ ఇలా రాశారు: “ఇరాన్, అమెరికా సహాయంతో, అన్ని సముద్ర మైన్‌లను తొలగించింది, లేదా తొలగిస్తోంది!”

అమెరికా నౌకాదళం వద్ద ప్రస్తుతం ఆ ప్రాంతంలో మైన్‌లను తొలగించే కార్యకలాపాల కోసం సన్నద్ధమైన ఒక లిట్టోరల్ కాంబాట్ షిప్ ఉంది, దానితో పాటు ఇలాంటి పనులను చేయగల ఇతర సైనిక ఆస్తులు కూడా ఉన్నాయి. అదనంగా, జపాన్ నుండి మరో రెండు మైన్-క్లియరింగ్ నౌకలను మోహరించారు అవి ఆ ప్రాంతానికి మార్గంలో ఉన్నాయి. 

గత నెలలో ఇరాన్, హోర్ముజ్‌లో మైన్‌లను అమర్చడానికి చిన్న పడవలను ఉపయోగించింది. అయితే, ఇరాన్ ఆ మైన్‌ల అమరికను నమోదు చేసిందా? లేదా? అనేది స్పష్టంగా తెలియదని ఆ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, ఇరాన్ నమోదు చేసిన కొన్ని మైన్‌లను, అవి కొట్టుకుపోయేలా లేదా కదిలేలా అమర్చారు. దీనివల్ల వాటిని గుర్తించడం కష్టమైంది. 

కాగా, ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఈ మార్గం మూసి ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ వెల్లడించారు. శనివారం రాత్రి ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలోమాట్లాడుతూ  ఇరాన్‌ను బలహీనపరచాలని శత్రు దేశాలు పన్నిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయని తెలిపారు. ఇరాన్ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చాలని, ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హార్ముజ్ జలసంధిని బలవంతంగా తెరవడం నుంచి ఇరాన్ క్షిపణి సామర్థ్యం, నౌకాదళం, వ్యూహాత్మక ప్రాంతాలపై పట్టు సాధించాలనుకున్న శత్రువుల ఏ ఒక్క లక్ష్యం కూడా నెరవేరదని ప్రకటించారు.  ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం అమెరికా ప్రధాన లక్ష్యమని గాలిబాఫ్ పేర్కొన్నారు. ఈ జలసంధిని తమ అదుపులోకి తీసుకోవడం ద్వారా ఇరాన్‌ను ప్రపంచ దేశాల నుంచి వేరు చేయాలని వారు చూశారని, కానీ ఇరాన్ నౌకాదళం, క్షిపణి దళాల పహారా ముందు వారి ప్రయత్నాలు సాగలేదని ఆయన తెలిపారు. 

మరోవంక, ఆంక్షలను ఎదుర్కొంటూ సముద్రంలో ఉండిపోయిన రష్యా చమురు కొనుగోలుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నెల రోజుల పాటు అనుమతి ఇచ్చారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా భగ్గుమన్న ఇంధన ధరలను అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా తెలిపింది. నౌకలలో నింపిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు శుక్రవారం నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ, అంటే 30 రోజుల పాటు అనుమతి ఇచ్చామని అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో పోస్ట్‌ చేసిన డాక్యుమెంట్‌ వివరించింది.