1300 మంది భారతీయ విద్యార్థులకు చైనా వీసాలు మంజూరు

కరోనా మహమ్మారి కారణంగా భారత్‌కు తిరిగి వచ్చిన 1300 మంది భారతీయ విద్యార్థులకు చైనా తిరిగి వీసాలు మంజూరు చేసింది. దీంతో విద్యార్థులు తమ చదువులను పూర్తి చేసే అవకాశం కలిగింది. 2020లో కరోనా మహమ్మారి కొవిడ్‌ నిబంధనల కారణంగా విద్యార్థులందరికీ వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. 

ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖలోని ఆసియా వ్యవహారాల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ లియూ జిన్‌సాంగ్‌ భారత రాయబారి ప్రదీప్‌ రావత్‌తో సమావేశమై, పురోగతిని వివరించారు. 1300 మందికి పైగా భారతీయ విద్యార్థులకు వీసాలు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, చైనాలోని మెడికల్‌ కాలేజీల్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.

23 వేల మందికిపైగా విద్యార్థుల పేర్లు చైనీస్‌ కాలేజీల్లో నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే. అయితే, గత కొంతకాలంగా భారత విద్యార్థులను తిరిగి అనుమతించాలని చైనాను కోరుతున్నది. గత జూలైలో చైనా విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ భేటీ అయ్యారు. విద్యార్థులు తిరిగి కళాశాలకు వెళ్లేలా అనుమతించాలని, ఈ మేరకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కోరారు.

2019 చివరలో వూహాన్‌లో కరోనా వ్యాప్తి అనంతరం రెండు దేశాల మధ్య విమాన సేవలు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షల కారణంగా చైనాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే చైనాలో పని పని చేస్తున్న భారతీయులు, వ్యాపారుల కుటుంబాలు సైతం విమాన సర్వీసులు లేక ఇబ్బందులు పడ్డారు. 

కరోనా ఆంక్షల నేపథ్యంలో తిరిగి వీసాలు ఇచ్చేందుకు నిరాకరించి, ఏప్రిల్‌లో తిరిగి చైనా రావాలనుకునే భారతీయ విద్యార్థుల వివరాలను సేకరించాలని ఆ దేశ రాయభార కార్యాలయం కోరింది. చైనాలో 23 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మెడిసిన్ చదువుతున్నవారే.

వీరిలో 12వేల మంది తమ చదువులు పూర్తి చేసేందుకు మళ్లీ చైనా వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను ఎంబసీకి అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్యవేత్తలకు మాత్రమే విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. మరో వైపు ఇటీవల చైనా పాకిస్తాన్, థాయ్‌లాండ్, సోలమన్ ఐస్‌లాండ్, లంకన్‌ విద్యార్థులు తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వగా, వారంతా ఆ దేశానికి చేరుకున్నారు.