కొత్త తరానికి అవకాశం కల్పించడానికే అధ్యక్ష పోటీకి దూరం!

కొత్త తరానికి అవకాశం కల్పించడానికే అధ్యక్ష పోటీకి దూరం!
దేశాన్ని ఏకతాటిపై నిలపడానికి కొత్త తరానికి అవకాశం కల్పించడానికే తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమని భావించినట్లు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత ఆయన తొలిసారి ప్రసంగించారు. మెరికన్లను ఉద్దేశించి ‘ఓవల్ ఆఫీస్’ నుంచి ఆయన చారిత్రాత్మకమైన ప్రసంగం చేశారు.
 
 డెమొక్రాటిక్ పార్టీని, దేశాన్ని ఏకం చేసేందుకే తాను 2024 ఎన్నికల నుంచి వైదొలగుతున్నట్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కంటే పదవులు ముఖ్యం కాదని చెప్పారు. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించారు. అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందని, దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.  
 
నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదంటూ పరోక్షంగా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.  ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సమర్థురాలని చెబుతూ ఆమె అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా హారిస్​ తగిన వ్యక్తి అని తెలిపారు.  
 
డొనాల్డ్ ట్రంప్‌తో పోల్ డిబేట్‌లో జో బైడెన్ వెనుకబడడం, ఆ తర్వాత ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలంటూ డెమొక్రాటిక్ శ్రేణులు బైడెన్‌పై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాయి. దాదాపు రెండు వారాల తర్వాత ఆయన రేసు నుంచి వైదొలిగారు. దీంతో భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారీస్ రేసులోకి వచ్చిన విషయం తెలిసిందే.
 
 అధ్యక్ష కార్యాలయాన్ని గౌరవిస్తానని చెప్పారు. అంతకంటే ఎక్కువగా దేశాన్ని ప్రేమిస్తున్నానని తెలిపారు. అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని చెప్పారు.  అమెరికా రాజకీయాల్లో ప్రతీకారాలకు ముగింపు పలకాలని స్పష్టం చేశారు.
 
దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజలంతా ఏకం కావాలని బిడెన్ పిలుపిచ్చారు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అధ్యక్షుడిగా, అమెరికా భవిష్యత్తు కోసం రెండోసారి ప్రెసిడెంట్‌గా పోటీ చేసే సామర్ధ్యం తనకు ఉందని నమ్ముతున్నాని చెప్పారు. కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఏది అడ్డురాకూడదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు.
 
కాగా జీవితంలో అత్యంత కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఓవల్ కార్యాలయంలో ఆయన ముందు కూర్చొని విన్నారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. భార్య జిల్ బైడెన్, కూతురు యాష్లే, కొడుకు హంటర్ ఉన్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి ఆప్యాయంగా చేతులు పట్టుకున్నారు. బిడెన్ మనవరాళ్లు కూడా ఓవల్ ఆఫీస్‌కు వచ్చారు.

కాగా అధ్యక్ష ఎన్నికలకు ఫిట్ కాని వ్యక్తి అధ్యక్షుడిగా మాత్రం ఎలా కొనసాగుతారని, వైగొలగాలంటూ రిపబ్లికన్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా పనిచేయడానికి ఆయన తగినవాడు కాదని అంటున్నారు.ఈ విమర్శలకు జో బైడెన్ సమాధానం ఇస్తూ  తాను కుంటివాడిని కాదని, పదవిలో ఉన్నంత కాలం ఆర్థిక వ్యవస్థ, కీలకమైన విదేశాంగ విధాన సమస్యలపై పని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే ఆరు నెలల్లో తాను అధ్యక్షుడిగా పని చేయడంపై దృష్టి పెడతానని చెప్పారు.