అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ సరికొత్త అవినీతి వివాదం ముసురుకుంది. ఆయన వ్యక్తిగత స్టాక్ మార్కెట్ లావాదేవీలపై అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. 2026 జనవరి – మార్చి మధ్య కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే ట్రంప్ ఏకంగా 3,700కు పైగా స్టాక్స్ లావాదేవీలు నిర్వహించడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో దావానలంలా వ్యాపించింది.
వైట్ హౌస్ అధికారాలను, ప్రభుత్వ రెగ్యులేటరీ నిర్ణయాలను అడ్డం పెట్టుకుని ట్రంప్ టెక్ కంపెనీలు, ప్రభుత్వ కాంట్రాక్ట్ సంస్థల షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరిపారని, దీని ద్వారా అక్రమంగా లబ్ధి పొందారని ప్రతిపక్ష డెమొక్రాట్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ అవినీతి ఆరోపణల్లో అత్యంత కీలకమైన అంశం ప్రముఖ టెక్ దిగ్గజం ‘ఎన్విడియా’ షేర్ల కొనుగోలు.
చైనాకు అడ్వాన్స్‌డ్ ఎన్విడియా ఏఐ చిప్స్ విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇచ్చే సరిగ్గా వారం రోజుల ముందు అంటే జనవరి 6వ తేదీన ట్రంప్ ఏకంగా 1 మిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా షేర్లను కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం ముందే తెలిసి చేసుకునే ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు ఇది నిదర్శనమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అంతేకాకుండా, చైనా ప్రభుత్వంతో లాబీయింగ్ నిర్వహించడానికి, తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసమే అమెరికన్ కంపెనీల సీఈఓలను ట్రంప్ చైనా పర్యటనకు తీసుకెళ్లారనే ఆరోపణలు ఈ వివాద తీవ్రతను మరింత పెంచాయి. అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ దేశ విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేసే స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోను లాభాల్లోకి నెట్టుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని లీగల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఒకవైపు అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ సవాళ్లు నడుస్తున్న తరుణంలో, సాక్షాత్తూ దేశ అధ్యక్షుడే ఇలా వేల సంఖ్యలో షేర్ల ట్రేడింగ్ చేస్తూ దొరికిపోవడం వైట్ హౌస్ ప్రతిష్టను మసకబార్చేలా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ‘స్టాక్ స్కామ్’ ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సంక్షోభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

More Stories
ట్రంప్ పోస్ట్ లో అమెరికా జెండా ఉన్న గల్ఫ్ పటం, పేలుడు చిత్రాలు
యూఏఈలో అణువిద్యుత్ కేంద్రంపై దాడి.. ఖండించిన భారత్
ప్రధాని మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్