యూఏఈలో అణువిద్యుత్‌ కేంద్రంపై దాడి.. ఖండించిన భారత్‌

యూఏఈలో అణువిద్యుత్‌ కేంద్రంపై దాడి.. ఖండించిన భారత్‌
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఇది ఇరాన్ చర్యేనని భావిస్తున్నారు.  ఈ దాడి కారణంగా ప్లాంట్ ఆవరణలో ఉన్న ఎలక్ట్రికల్ జనరేటర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రోన్ దాడి కారణంగా చెలరేగిన మంటలు అణు ప్లాంట్‌ వెలుపల వరకు మాత్రమే పరిమితమయ్యాయని బుదాబి అధికారిక మీడియా వెల్లడించింది.  డ్రోన్‌ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది.
ప్లాంట్‌ లోపల ఉండే ప్రధాన అణు రియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టిం చేసింది. రేడియేషన్‌ సమస్య కూడా తలెత్తలేదని పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని తెలిపింది.  యూఏఈకి దాదాపు 25 శాతం విద్యుత్‌ను అందించే ఈ కీలక కేంద్రంపై దాడి జరగడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.  ఇరాన్ యుద్ధంలో నాలుగు రియాక్టర్లు గల బరకా అణు విద్యుత్ కేంద్రాన్ని చురుకుగా లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి.
ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  “యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్‌ దాడిపట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు.  ఇవి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి. తక్షణమే ఇరుపక్షాలు సంయమనం పాటించి.. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. 

పశ్చిమ సరిహద్దు నుంచి మూడు డ్రోన్లు దేశంలోకి ప్రవేశించాయని, వాటిలో ఒకటి అణు కేంద్రం లోపలి ప్రాంగణంలో పడగా, మరో రెండింటిని కూల్చివేసినట్లు  యూఏఈ అధికారులు తెలిపారు. ఈ దాడిని ‘అకారణంగా జరిగిన ఉగ్రవాద చర్య’ గా యూఏఈ ప్రభుత్వం అభివర్ణించింది.  దాడి జరిగిన వెంటనే యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు దేశాల విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ దేశాలన్నీ దాడిని ఖండిస్తూ యూఏఈకి మద్దతు ప్రకటించాయి. యూఏఈ అధ్యక్ష సలహాదారు అన్వర్ గర్గాష్ మాట్లాడుతూ ఈ దాడి వెనుక ఇరాన్ లేదా దాని అనుబంధ సంస్థల హస్తం ఉండవచ్చని ఆరోపించారు. గతంలో యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఈ ప్లాంట్‌పై దాడికి యత్నించినట్లు ప్రకటించినా, యూఏఈ దాన్ని ఖండించింది.