శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రధాని  మహాకాళ్ మందిరంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు.  భారతదేశ అభ్యుదయం, విజ్ఞానానికి ఉజ్జయిని వేలాది సంవత్సరాలుగా నాయకత్వం వహించిందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రూ.856 కోట్ల వ్యయంతో చేపట్టిన ‘మహాకాల్‌ లోక్‌ కారిడార్‌’ను ఆయన మంగళవారం  జాతికి అంకితమిచ్చారు. వేదికపై నుంచి శివలింగం ప్రతిరూపాన్ని రిమోట్‌ కంట్రోల్‌ బటన్‌ నొక్కి ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్‌ మంగూబాయ్‌ పటేల్‌, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లతో కలసి బ్యాటరీ కారులో ప్రయాణిస్తూ కారిడార్‌ను వీక్షించారు.
కార్తిక్‌ మేళా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ మహాకాల్‌ ప్రాజెక్టుతో ఉజ్జయినికి శోభ చేకూరనుందని చెప్పారు. ఇక్కడి ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత నిండి ఉందని, నలుదిశలా దైవశక్తి ప్రసారమవుతోందని పేర్కొన్నారు. మొదటిసారిగా చార్‌ధామ్‌లను ఆల్‌-వెదర్‌ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు.
అంతకుముందు  సంప్రదాయ వస్త్రధారణలో సాయంత్రం 6 గంటలకు గర్భగుడిలోకి ప్రవేశించిన ఆయన దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిల్వ దళం, రుద్రాక్ష మాలలు పట్టుకొని ధ్యానం చేశారు.
12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పురాతన మహాకాళేశ్వర్‌   ఆలయంలో అభివృద్ధి చేసిన 900 మీటర్ల పొడవైన కారిడార్ అయిన ‘మహాకాల్ లోక్‌’ను  భక్తులను ఆథ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లే విధంగా తీర్చిదిద్దారు.దేశంలోని శివాలయాలన్నీ ఉత్తరాభిముఖంగా ఉంటే  ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయ ముఖద్వారం మాత్రం దక్షిణాభిముఖంగా ఉంటుంది.
 
అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఇక్కడ ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు, సప్తరుషుల శిల్పాలు, 190 రూపాల్లో నీలకంఠుడి ప్రతిమలకు తోడు సుందరమైన కొలనులతో కొత్త సొబగులు అద్దుకుంది. శివతత్వం ఉట్టిపడే నిర్మాణాలను సందర్శకులకు అలౌకిక అనుభూతి కలిగించేలా తీర్చిదిద్దారు. 
 
విశేష అలంకరణలతో 108 ఇసుక స్తంభాలు, వాటిపై శివ ముద్రలతో కూడిన త్రిశూల చిహ్నాలు, 111 అడుగుల పొడవైన భారీ శివ వివాహ కుడ్య చిత్రం, ఆనంద తాండవ స్వరూప చిత్రం, 200కు పైగా శివ, శక్తుల విగ్రహాలు, ఆకర్షణీయమైన ఫౌంటేన్లు, శివ పురాణంలోని కథలను వర్ణించే 50 కంటే ఎక్కువ కుడ్య చిత్రాలు.. ఇలా నలువైపులా శివతత్త్వంతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. 
 
పాత రుద్రసాగర్‌ సరస్సు చుట్టూ విస్తరించిన 900 మీటర్ల కంటే పొడవైన, విశాలమైన ఈ కారిడార్‌ ప్రధాన స్థానం వద్ద నంది, పినాకి అనే రెండు భారీ ద్వారాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మిడ్‌వే జోన్‌, పార్కు, కార్లు బస్సుల కోసం బహుళ అంతస్థుల పార్కింగ్‌, దుకాణ సముదాయం, సోలార్‌ లైటింగ్‌, యాత్రికుల వసతి కేంద్రం అభివృద్ధి చేశారు
గర్భగుడి శ్రీ చక్రయంత్రం తిరగవేసి ఉండటం ఇక్కడి మరో ప్రత్యేకత. 5 అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయంలో మహా కాళేశ్వరుడికి ప్రాత: కాలం భస్మాభిషేకం చేస్తారు. 2017లో ఈ ప్రాజెక్టు మొదలు కాగా, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా రాష్ట్రాల కార్మికులు నిర్మాణాలను తీర్చిదిద్దారు. మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’లో పేర్కొన్న జాతుల మొక్కలను సైతం ఇక్కడి ఆవరణలో నాటారు. రుద్రాక్ష్, బేల్‌పత్ర, సప్తపర్ణి వంటి 40-45 రకాల మొక్కలు సందర్శకులను అలరిస్తాయి.