చంద్రచూడ్ సీజేఐ అయితే భారత న్యాయ వ్యవస్థలో సరికొత్త చరిత్ర

 
తన పదవీ విరమణ అనంతరం తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుత న్యాయమూర్తులలో సీనియర్ అయినా జస్టిస్  డివై చంద్రచూడ్  పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో ఆయన నియామకం ఇక లాంఛనమే కానుంది. 
 
జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడితే భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఓ రికార్డుగా మారనుంది.  ఈ అత్యున్నత  పదవిని నిర్వహించిన మొదటి తండ్రి, కొడుకులుగా వారు చరిత్రలో నిలుస్తారు. తండ్రి, కొడుకులు న్యాయమూర్తులయిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఇద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటివరకు ఎవ్వరు కాలేదు. 
 
గతంలో ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ సీజేఐగా పదవీ బాధ్యతలను నిర్వహించారు.  జస్టిస్ వైవీ చంద్రచూడ్ 1978 నుంచి 1985 వరకు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. దాదాపు ఏడేళ్ళపాటు ఆయన సీజేఐగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ పదవిని ఇంత ఎక్కువ కాలం నిర్వహించిన న్యాయమూర్తి ఆయనే. 
 
అదే విధంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపడితే, ఆయన పదవీ కాలం సుమారు రెండేళ్ళు ఉంటుంది. ఇటీవలి కాలంలో ఇంత సుదీర్ఘ కాలం ఈ పదవిని నిర్వహించేది కూడా ఆయనేనని చెప్పవచ్చు.  జస్టిస్ డీవై చంద్రచూడ్ వచ్చే నెలలో భారత దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
 
 ఇదిలావుండగా, జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఇచ్చిన రెండు తీర్పులను ఆయన కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ రద్దు చేయడం విశేషం. వ్యభిచారం, వ్యక్తిగత గోప్యతలపై జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు. 
 
.ప్రభ, జస్టిస్‌ యశ్వంత్‌ విష్టు చంద్రచూడ్‌లకు 1959 నవంబర్‌ 11న ధనంజయ వై చంద్రచూడ్‌ జన్మించారు. తల్లి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. డివై చంద్రచూడ్‌ ముంబాయిలో కేథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ స్కూల్‌ చదివారు. తరువాత ఢిల్లీలో సెయింట్‌ కొలంబస్‌ స్కూల్‌లో చదివారు. 1979లో ఆయన సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌ (ఢిల్లీ)లో ఎకనామిక్స్‌, మ్యాథమెటిక్స్‌లో ఆనర్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు.
 
 1982లో ఢిల్లీ యూనివర్శిటీలోని లా సెంటర్‌ క్యాంపస్‌లో ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. సీనియర్‌ న్యాయవాదులు, న్యాయమూర్తులకు చేస్తూ జూనియర్‌ న్యాయవాదిగా చంద్రచూడ్‌ కొంత కాలం పని చేశాడు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది పాలీ నారిమన్‌కు సంబంధించిన కొన్నింటిని డ్రాఫ్టింగ్‌ చేశారు. 1983లో హార్వర్డ్‌ లా స్కూల్‌ నుండి ఎల్‌ఎల్‌ఎం డిగ్రీని పొందారు. 1986లో హార్వర్డ్‌లో ఆయన డాక్టరేట్‌ ఆఫ్‌ జురిడికల్‌ సైన్స్‌ (ఎస్‌జెడి) పూర్తి చేశారు. 
 
ముంబాయి హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1998 జూన్‌లో ముంబాయి హైకోర్టు సీనియర్‌ న్యాయవాది అయ్యారు. అదే ఏడాదిలో అడిషనల్‌ సొలిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన 39 ఏళ్ళ వయసులో సీనియర్ అడ్వకేట్‌ డిజిగ్నేషన్ పొందడం ఓ రికార్డు. మన దేశంలో అత్యంత తక్కువ వయసులో సీనియర్ అడ్వకేట్ అయిన న్యాయవాది ఆయనే.
భారత దేశ అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1998లో నియమితులయ్యారు.  2000 మార్చి 29న ముంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ సమయంలోనే మహారాష్ట్ర జ్యూడీషియల్‌ అకాడమీకి డైరెక్టర్‌గా పని చేశారు. 2013 అక్టోబర్‌ 31న అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
 
 2021 ఏప్రిల్‌ 24న సుప్రీం కోర్టు కొలీజియం సభ్యుడు అయ్యాడు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఉన్నారు. ముంబాయి యూనివర్శిటీ, అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ ఓక్లహౌమా కాలేజ్‌ ఆఫ్‌ లాలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా కూడా ఉన్నారు.
రాజ్యాంగ చట్టం, మానవ హక్కులు, లింగ న్యాయం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వాణిజ్య చట్టం, క్రిమినల్‌ చట్టాలపై తీర్పులు ఇచ్చారు. లైంగిక స్వయం ప్రతిపత్తి, గోప్యత, పర్యావరణం, రాజకీయ పరమైన అంశాలపై తీర్పులు ఇచ్చారు. 
 
శబరిమల, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, కార్మికుల శ్రమ, వికలాంగుల హక్కులు, బీమా చట్టం, ఆధార్‌, నిఘా, మనీబిల్లు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు మహిళ ప్రాథమిక హక్కుల ఉల్లంఘిస్తాయంటూ తీర్పులు ఇచ్చారు.  ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు స్వతంత్ర నిర్ణయాధికారం లేదని, ముఖ్యమంత్రి కార్యనిర్వాహక అధిపతి అని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చారు. కరోనా సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు)ను గుర్తు చేస్తూ ప్రభుత్వం వైద్య సహాయం నిరాకరించకూడదని స్పష్టం చేశారు. 
 
కరోనా చికిత్స, వైద్య సేవలు, మెడిసన్‌, ఆక్సిజన్‌ వంటి సామాగ్రి, వ్యాక్సిన్‌ వంటి సేవలు అందజేయాలని కేంద్రానికి ఆదేశించారు. అసమ్మతి సజీవ ప్రజాస్వామ్యానికి ప్రతీక స్పష్టం చేశారు. అసమ్మతిని అనుమతించకపోతే, ప్రెషర్‌ కుక్కర్‌ పగలిపోతోందని ఒక తీర్పులో పేర్కొన్నారు.