సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేశారు. ములాయం మరణం దేశానికి తీరని నష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ములాయం మరణం పట్ల ట్విట్టర్ లో సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ సైతం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ‘‘యూపీ, దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ జీ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అత్యవసర కాలంలో (ఎమర్జెన్సీ) ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన సైనికుల్లో మఖ్యమైన నేత. రక్షణ మంత్రిగా భారత్ ను బలోపేతం చేశారు. పార్లమెంటు చర్చల్లో ఆయన ప్రమేయం అంతర్ దృష్టితో, దేశ ప్రయోజన హితంగా ఉండేది” అని కొనియాడారు.
తామిద్దరం ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న సమయంలో ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నామని, సన్నిహిత సంబంధం అలాగే కొనసాగిందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆయన అభిప్రాయాలు వినడానికి తాను ఎల్లప్పుడూ ఆసక్తి చూపేవాడినని చెప్పారు. ఆయన మరణం తనను బాధిస్తోందని చెబుతూ ఆయన కుటుంబానికి, ఆయన లక్షలాది మద్దతుదారులకు సంతాపం తెలిపారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ.. ములాయం జ్ఞాపకాలు తనతో ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.
‘‘యూపీ మాజీ ముఖ్యమంత్రి, సామాజిక నేత శ్రీ ములాయం సింగ్ యాదవ్ మరణ వార్త తెలిసింది. ఆయన ఆత్మకు దేవుడు తన పాదాల వద్ద చోటు ఇవ్వాలి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి’’ అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ములాయం మృతి పట్ల యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి అధికార లాంఛనాలతో ములాయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్‌లో మాట్లాడారు. సామాజిక సిద్ధాంతం కోసం ములాయం తుది వరకు పోరాటం చేశారని సీఎం యోగి ఓ ప్రకటనలో తెలిపారు.
ములాయం సింగ్ యాదవ్ మృతికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ మరణవార్త ఎంతో బాధ కలిగించిందని చెబుతూ తనకు అత్యంత ఆప్తులు, సోదరుడిని ఈ రోజు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘4 దశాబ్దాలుగా హుందా రాజకీయాలతో నన్ను ఎప్పుడూ ఆకట్టుకున్న నేత ములాయం. ఆయనతో కలిసి గతంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తన ఆలోచనల ద్వారా లక్షలాది మంది జీవితాలను మార్చిన నేత ములాయం. అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని కొనియాడారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి