ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

 భారత రాజకీయాల్లో మరో శిఖరం ఒరిగిపోయింది. ఆరు దశాబ్దాల పాటు ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేతాజీ ప్రస్థానం ముగిసింది. అగ్రవర్ణ ఆధిపత్యం ఉన్న యూపీలో రాజకీయంగా ఎదగడమే కాదు,  రాష్ట్ర పగ్గాలు చేపట్టిన రాజకీయాలను తిరగరాసిన మూలాయం సింగ్ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. 
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) ఇవ్వాల (అక్టోబర్ 10, సోమవారం) తెల్లవారుజామున మరణించారు. అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఐసియుకి తరలించారు. సమాజ్‌వాదీ పార్టీ ట్విటర్ హ్యాండిల్‌లో పంచుకున్న సంక్షిప్త ప్రకటనలో అఖిలేష్ యాదవ్   “నా గౌరవనీయమైన తండ్రి,అందరి నాయకుడు ఇక లేరు”అని తెలిపారు.
 
 శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటూ మేదాంత ఆసుపత్రిలో అంతర్గత వైద్య నిపుణుడి పర్యవేక్షణలో ఉన్నారు. సింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్‌తో కూడా బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అక్టోబరు 2న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకి తరలించారు. 
 
ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్‌తో కలిసి గురుగ్రామ్ ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్న  మేదాంత హాస్పిటల్ ఈ నాయకుడి పరిస్థితి చాలా విషమంగా ఉందని, ఆయన లైఫ్​ సపోర్ట్​మీద ఉన్నాడని  హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక,  సోమవారం ఉదయం 8:15 గంటల ప్రాంతంలో ములాయం సింగ్ యాదవ్ తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
 1939 నవంబర్ 22న సుఘర్ సింగ్ యాదవ్, మూర్తి దేవి దంపతులకు జన్మించారు ములాయం సింగ్ యాదవ్. యూపీ ఇటావా జిల్లాలోని సైఫాయ్ ఆయన స్వస్థలం. ఇటావాలోని కర్మ క్షేత్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ నుంచి బీఏ పట్టా పొందిన ఆయన షికోహాబాద్ లోని ఏకే కాలేజ్ నుంచి బీటీ, ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు.  
 
 రామ్ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్ అడుగుజాడల్లో నడుస్తూ ములాయం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా చెప్పే ఉత్తర్ ప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత నేతాజీ సొంతం. 1967లో యూపీ అసెంబ్లీలో తొలిసారి ఆయన అడుగుపెట్టారు. 
 
1975లో ఇందిరా గాంధీ అత్వవసర స్థితి విధించినప్పుడు మూలాయంను అరెస్టు చేసి 19 నెలల పాటు జైలులో ఉంచారు. ఆ తర్వాత 1977లో తొలిసారి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో, ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌దళ్ (పీపుల్స్ పార్టీ) అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత దాన్ని జనతాదళ్ లో విలీనం చేశారు. 1982లో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై 1985 వరకు ఆ పదవిలో కొనసాగాడు. లోక్ దళ్ పార్టీ చీలిపోయినప్పుడు, యాదవ్ క్రాంతికారి పార్టీని ప్రారంభించాడు.
 
1939 నవంబర్ 22వ తేదీన యూపీలో జన్మించిన ములాయం యూపీ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగానూ ఈయన పనిచేశారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి  ములాయం మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1970 నుంచి ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలక వ్యక్తిగా మారారు.
 1989లో ములాయం సింగ్ యాదవ్ తొలిసారి యూపీ సీఎం అయ్యారు. 1990 నవంబరులో వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోవడంతో ములాయం యాదవ్, చంద్ర శేఖర్ నాయకత్వంలోని జనతా దళ్ (సోషలిస్ట్) పార్టీలో చేరాడు. కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 
 
 జాతీయ స్థాయిలో చంద్ర శేఖర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో 1991 ఏప్రిల్ లో ములాయం సింగ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ములాయం ప్రభుత్వం కూలిపోయింది. మధ్యలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు రాగా.. ములాయం పార్టీ పరాజయం పాలైంది.
 
 1992లో ములాయం సింగ్ సొంతంగా సమాజ్ వాదీ పార్టీ స్థాపించారు.1993 నవంబరులో యూపీ అసెంబ్లీకి ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారం చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్, జనతాదళ్ మద్దతుతో ములాయం రెండోసారి యూపీ సీఎం అయ్యారు. 
 
1994 అక్టోబర్ 2న ముజఫర్ నగర్ లో ప్రత్యేక ఉత్తరాఖండ్ ఉద్యమంలో పాల్గొంటున్న వారిపై కాల్పుల జరిగాయి. ఇందుకు ములాయంను బాధ్యుడిగా భావించి మిత్రపక్షం కూటమి నుంచి వైదొలగడంతో ఆయన పదవి వదులుకోవాల్సి వచ్చింది.  2002లో యూపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ, బీఎస్పీలు కలిసి మాయావతి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ 2003 ఆగస్టు 25న బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మాయావతి సర్కారు కుప్పకూలింది. 
 
బీజేపీ మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ 2003 సెప్టెంబర్ లో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటికి ఆయన లోక్ సభ ఎంపీగా ఉండటంతో ఆరు నెలల్లోపు శాసనసభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉండటంతో 2004లో జరిగిన గున్నౌర్ ఉప ఎన్నికలో పోటీ చేసి 94శాతం ఓట్లతో విజయం సాధించి రికార్డు సృష్టించాడు.
 
ములాయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే  కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించాలనే ఆశతో, 2004 లోక్‌సభ ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి పోటీ చేసి గెలిచాడు. అప్పట్లో సమాజ్ వాదీ పార్టీ యూపీలోని అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల మద్దతుతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
ఫలితంగా కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్న ఆయన ఆశ నెరవేరలేదు. దీంతో లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, 2007 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2007 ఎన్నికలలో బీఎస్పీ విజయం సాధించింది. 1967లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికైన ములాయం.. మొత్తం 10 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.    ములాయం సింగ్ ఐదుసార్లు మొయిన్ పురి ఎంపీగా గెలిచారు. సంభాల్ నుంచి రెండుసార్లు కనౌజ్, అజాంగఢ్ నుంచి ఒక్కోసారి విజయం సాధించారు. కేంద్రంలో రక్షణ మంత్రిగానూ సేవలందించారు.
ములాయంసింగ్‌ యాదవ్ ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. ములాయం మొదటి భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్‌యాదవ్. రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్‌యాదవ్ లోహియా. ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ సైతం 2012 నుంచి 2017 వరకు యూపీ సీఎంగా కొనసాగారు.