రాజ్యాంగ బాధ్యతలను విస్మరిస్తున్నారని కేజ్రీవాల్ కు సక్సేనా మందలింపు 

ఉపన్యాసాలు, ప్రకటనలతోనే పరిపాలన సాగుతోందని, రాజ్యాంగ బాధ్యతలను విస్మరిస్తున్నారని, మౌలిక ప్రజాహిత కార్యక్రమాలకు ప్రభుత్వం దూరమైందని అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను   లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సున్నితంగా మందలించారు.

కేజ్రీవాల్‌కు అత్యంత ఘాటుగా వ్రాసిన ఓ లేఖలో ప్రస్తుతం రద్దయిన ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీపై దర్యాప్తు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న కార్యక్రమానికి కేజ్రీవాల్, ఆయన మంత్రులు హాజరు కాకపోవడం, విద్యుత్తు ఛార్జీల్లో రాయితీ, టీచర్స్ రిక్రూట్‌మంట్ గురించి ఆయన ప్రస్తావించారు. 

పరిపాలనకు సంబంధించిన రాజ్యాంగపరమైన విధులు, బాధ్యతలకు కేజ్రీవాల్, ఆయన మంత్రులు దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. ‘‘మీ ప్రభుత్వం ఉపన్యాసాలు, ప్రకటనల సాయంతో నడుస్తోంద’’ని ధ్వజమెత్తారు. 

వీకే సక్సేనాపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఎల్‌జీపై మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తులకు ఆదేశిస్తున్నారని అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఎల్‌జీ రాస్తున్న లేఖలను ప్రేమలేఖలుగా కేజ్రీవాల్ ఎద్దేవా  చేస్తున్నారు.

కేజ్రీవాల్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, తనకు మరొక ప్రేమలేఖ వచ్చిందని చెప్పారు. ఢిల్లీ ప్రజల జీవితాలను ఎల్‌జీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేయాలని బీజేపీ కంకణం కట్టుకుందని మండిపడ్డారు. ప్రతి రోజూ బీజేపీ వివాదాన్ని సృష్టిస్తోందని, ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.

ఢిల్లీ ప్రజలకు తాను కొడుకువంటివాడినని చెప్పుకుంటూ, ‘‘మీ బిడ్డ జీవించి ఉన్నంత కాలం మీరు ఆందోళన చెందనక్కర్లేదని హామీ ఇస్తున్నాను’’ అని చెప్పారు. అయితే,  పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతోనే తాను లేఖలను రాస్తున్నానని ఎల్‌జీ సక్సేనా చెప్తున్నారు. మంత్రులు, రాజకీయ ప్రత్యర్థులపై కేజ్రీవాల్, ఆయన సహచరులు తప్పుడు ఆరోపణలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.