కర్ణాటకలో  ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు 

కర్ణాటకలో శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచాలని బసవరాజ్‌ బొమ్మై సర్కార్‌ నిశ్చయించింది. జస్టిస్‌ హెచ్‌ఎన్‌ నాగమోహన్‌ దాస్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.

అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రిజర్వేషన్ల పెంపునకు ఎస్సీ, ఎస్టీలు దీర్ఘకాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నారని, నాగమోహన్‌ దాస్‌ కమిషన్‌ సిఫారసులను అఖిలపక్ష సమావేశం ఆమోదించిందని తెలిపారు.

 శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపుపై లాంఛనంగా నిర్ణయం తీసుకోనున్నట్టు బొమ్మై చెప్పారు. నాగమోహన్‌ దాస్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు బొమ్మై సర్కార్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

మరోవైపు ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలంటూ వాల్మీకి గురుపీఠం అధిపతి ప్రసన్నానంద స్వామి ఆమరణ దీక్ష చేపట్టారు. నాగమోహన్‌ దాస్‌ కమిషన్‌ 2020 జూలైలోనే తన సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ సిఫారసులను అమలు చేసేందుకు జస్టిస్‌ సుభాష్‌ బీ ఆది నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా ఇప్పటికే తన నివేదికను సమర్పించింది.

ప్రస్తుతం కర్ణాటకలో ఓబీసీలకు 32%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 3% రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి చేరాయి. దీంతో అక్కడ ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచేందుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ను సవరించడమే ఏకైక మార్గంగా ఉన్నది.