`మాత మార్పిడి’ కార్యక్రమంలో ఆప్ మంత్రి ప్రసంగంపై దుమారం!

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌత‌మ్  వివాదంలో ఇరుక్కున్నారు. సామూహిక మ‌త మార్పిడి కార్య‌క్రంలో ఆయ‌న పాల్గొన్నారు. బౌద్ధ‌మ‌తం స్వీక‌రించాల‌ని చేసిన ప్ర‌తిజ్ఞ‌లో పాల్గొన్న ఆయ‌న హిందూ దేవుళ్ల‌ను పూజించ‌రాదు అంటూ పేర్కొన్నారు. 

 ‘దమ్మ చక్ర పరివర్తన్‌ దిన్‌’ పేరిట జై భీమ్‌ మిషన్‌ ఇటీవల నిర్వహించిన సామూహిక మతమార్పిడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులపై తనకు విశ్వా సం లేదని, వారిని పూజించబోనని ఆ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.  దాదాపు 10వేల మంది బౌద్ధం స్వీకరించిన ఈ కార్యక్రమంలో వారితో కలసి గౌతమ్‌ ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలు హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని అవమానించడమేనని బీజేపీ ఆరోపించింది

అంబేద్క‌ర్ బౌద్ధం స్వీక‌రించిన స‌మ‌యంలో ధ‌మ్మ చ‌క్ర ప్ర‌వ‌ర్త‌న్ దిన్ పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత ప్ర‌తి ఏడాది కూడా ఈ దినాన్ని పాటిస్తున్నారు. వేలాది మంది బౌద్ధం స్వీక‌రించిన తాజా కార్య‌క్ర‌మంలో ఆప్ మంత్రి గౌత‌మ్ పాల్గొన్నారు.  హిందువులు దసరా ఉత్సవాలు జరుపుకొంటున్న సమయంలో 10,000  మంది హిందువులను మతమార్పిడి చేస్తున్నామని అంటూ ఈ కార్యక్రమం చేపట్టడం, అందులో ఆప్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వివాదాస్పద వాఖ్యలు చేయడంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది.

బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రుడిపై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని, వాళ్ల‌ను పూజించ‌ను అని ఆయ‌న ప్ర‌తిన చేశారు. పైగా, హిందువులు తమ విశ్వాసాలను త్యజించి డాక్టర్ అంబేద్కర్ మార్గంలో నడవాలని చెబుతూ   “మీరు దేశద్రోహి అని పిలవకూడదనుకుంటే, మనం ప్రతి ఇంటికి  అంబేద్కర్ ఇచ్చినఈ సందేశాన్ని వ్యాప్తి చేయాలి” అని గౌతమ్ పిలుపిచ్చారు.

ఇది హిందూ మ‌తాన్ని, బౌద్ధ మ‌తాన్ని అవ‌మానించ‌డ‌మే అని బీజేపీ ఆరోపించింది.  ఆప్‌ మంత్రులు మత ఘర్షణలు సృష్టిస్తున్నారని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ్‌ను తక్షణం కేబినెట్‌ నుంచి, పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

గౌతమ్‌ ప్రతిజ్ఞ చేస్తున్న వీడియోను ట్వీట్‌ చేసిన బీజేపీ ఢిల్లీ విభాగం.. కేజ్రీవాల్‌ కేబినెట్‌లోని మంత్రి హిందువులపై విషం కక్కుతున్నాడని ఆరోపించింది. గౌతమ్‌ వ్యాఖ్యలు సమాజంపై ఆప్‌కు ఉన్న ద్వేషానికి నిదర్శనమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా మండిపడ్డారు.

అయితే, త‌న‌కు బౌద్ధంపై న‌మ్మ‌కం ఉంద‌ని, రాజ్యాంగం ప్ర‌కార‌మే మ‌త స్వేచ్ఛ‌ను పాటిస్తున్న‌ట్లు మంత్రి గౌత‌మ్ తెలిపారు. మొత్తం భారతదేశాన్ని బౌద్ధ దేశంగా మార్చేందుకు తాము కృషి చేస్తున్నామని 2020లో ఓ ఇంటర్వ్యూలో ఆ మంత్రి వెల్లడించడం గమనార్హం. 

”భారత్‌ను బౌద్ధ దేశంగా మార్చాల్సిన సమయం వచ్చింది. భారత్‌ను బౌద్ధ దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. అక్టోబర్ 2025 నాటికి 10 కోట్ల మందిని బౌద్ధమతంలోకి మార్చడమే మా లక్ష్యం” అని ఆయన చెప్పారు.

అయితే మంత్రి గౌతమ్‌పై కేజ్రీవాల్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, బౌద్ధం స్వీకరించడం మతమార్పిడి కాదని వీహెచ్‌పీ పేర్కొంది. ప్రజలు బౌద్ధ మతాన్ని స్వీకరించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదంది. రాజ్యాంగం కూడా బౌద్ధులను హిందువులుగానే పరిగణిస్తోందని వీహెచ్‌పీ అంతర్జాతీయ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ సురేంద్ర జైన్‌ స్పష్టం చేశారు.