పాక్, జర్మనీ విదేశాంగ మంత్రులపై భారత్ మండిపాటు

పాకిస్థాన్, జర్మనీ విదేశాంగ మంత్రులు శుక్రవారం బెర్లిన్‌లో సంయుక్త విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూ-కశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్థాన్, జర్మనీ చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. 
 
సరిహద్దుల ఆవలి నుంచి వస్తున్న ఉగ్రవాదం వల్ల ఎదురవుతున్న ప్రమాదాలను గుర్తించడంలో విఫలమవుతున్నారని అంటూ ఉదాసీనత, స్వీయ ప్రయోజనాలే దీనికి కారణమని మండిపడింది.  పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ, ఐక్య రాజ్య సమితి తీర్మానాలకు అనుగుణంగా, కశ్మీరీల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటూ, జమ్మూ-కశ్మీరు వివాదానికి శాంతియుత పరిష్కారం జరగకపోతే దక్షిణాసియాలో శాంతి సాధ్యం కాదని పేర్కొన్నారు.
జమ్మూ-కశ్మీరు సమస్య కేవలం ద్వైపాక్షిక అంశమని భారత దేశం చెప్తూ వస్తోంది. దీనిని భారత్, పాక్ మాత్రమే పరిష్కరించుకోవాలని స్పష్టం చేస్తుంది. అయితే జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేయిర్బోక్ మాట్లాడుతూ, మనం ప్రశాంత ప్రపంచంలో ఉండటం కోసం ఘర్షణలను పరిష్కరించడంలో ప్రపంచంలోని ప్రతి దేశానికి పాత్ర, బాధ్యత ఉన్నాయని తాను నమ్ముతున్నానని తెలిపారు.
ఈ నేపథ్యంలో మీడియా ప్రశ్నలకు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ  స్వీయ ప్రయోజనాలు, ఉదాసీనత కారణంగా సీమాంతర ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించలేకపోతున్న దేశాలను నిలదీశారు.
ప్రపంచంలో నిజాయితీ, మనస్సాక్షి గలవారంతా అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని, మరీ ముఖ్యంగా సీమాంతర స్వభావంగల ఉగ్రవాదాన్ని గట్టిగా నిలదీయవలసిన బాధ్యత, పాత్ర ఉన్నాయని ఆయన హితవు చెప్పారు.  అనేక దశాబ్దాల నుంచి ఇలాంటి ఉగ్రవాదం వల్ల ఇండియన్ యూనియన్ టెరిటరీ జమ్మూ-కశ్మీరు తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు.
ఈ పరిస్థితి నేటికీ కొనసాగుతోందని పేర్కొంటూ జమ్మూకశ్మీరుతో పాటు భారత దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విదేశీయులు ఈ ఉగ్రవాదానికి బలైపోతున్నారని ఆయన తెలిపారు. 2008 నవంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు పాల్పడిన పాకిస్థానీ ఉగ్రవాదులను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఎప్ఏటీఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్) ఇప్పటికీ వెంటాడుతున్నాయని ఆయన చెప్పారు.
స్వీయ ప్రయోజనాల వల్ల కానీ, ఉదాసీనత వల్ల కానీ  ఇలాంటి ప్రమాదాలను, అపాయాలను దేశాలు గుర్తించకపోతే, అవి శాంతి లక్ష్యాన్ని అణచివేసినట్లేనని, ఆ లక్ష్యాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు కాదని చెప్పారు. అంతేకాకుండా ఉగ్రవాద బాధితులకు ఆ దేశాలు తీవ్ర అన్యాయం చేసినట్లేనని ఆయన పేర్కొన్నారు.