అమెరికాలోని న్యూయార్క్‌లో ‘వలసల సంక్షోభం’ నెలకొనడంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దక్షిణ సరిహద్దు గుండా నగరంలోకి 17 వేల మందికి పైగా వలస వచ్చారు. రిపబ్లికన్ పాలిత రాష్ర్టాలైన టెక్సాస్, అరిజోనా, ఫ్లారిడా నుంచి డెమోక్రటిక్ రాష్ర్టాలకు వలసలు పెరిగిపోయాయి.
సెప్టెంబర్ నుంచి ప్రతిరోజూ శరణార్థులతో కూడిన 5-6 బస్సులు న్యూయార్క్‌లో ప్రవేశిస్తున్నాయని ఆడమ్స్ తెలిపారు. నగర షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు శరణార్థులేనని పేర్కొన్నారు. వలస వచ్చేవారిలో చిన్నారులు, వైద్యసేవలు అవసరమున్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
వారందరినీ ఆదుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.వంద కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ వలసల వల్ల ఇతర ప్రాధాన్యత పనులకు నిధులు లేకుండా పోయాయని వెల్లడించారు. కావాలనే రిపబ్లికన్ రాష్ర్టాలనుంచి జనాలను ఇక్కడికి పంపిస్తున్నారని ఆరోపించారు. నగర సామాజిక సేవలను కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని రిపబ్లికన్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాగా, వెనిజులాకు చెందిన కార్లోస్ అనే శరణార్థి మీడియాతో మాట్లాడుతూ తమ దేశంలో డ్రగ్స్ సమస్య విపరీతంగా ఉన్నదని, నిరుద్యోగం, హత్యలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని తెలిపాడు. న్యూయార్క్ నుంచి మద్దతు లభిస్తుందన్న ఆశతోనే తాము వలస వస్తున్నామని పేర్కొన్నాడు.
ఆ విధంగా వస్తున్న వారిలో చాలామందికి పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఉండడం, పైగా వారికి అత్యవసరంగా వైద్య చికిత్సలు అవసరం అవుతూ ఉండడంతో తమకు సమస్యలు తీవ్రం అవుతున్నాయని మేయర్ వాపోయారు. వీరిని ఆదుకోవడానికి ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఆర్ధిక సమయం అందించాలని ఆయన కోరారు.
మెక్సికో నుండి సరిహద్దు దాటి అక్రమంగా వలసలు వస్తున్నాయని అమెరికా కొంతకాలంగా వ్యక్తం చేస్తున్న ఆందోళన ప్రతిరూపమే ఈ సమస్య అని చెప్పవచ్చు. దేశ దక్షిణ సరిహద్దు నుండి వస్తున్న వలసలు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో వారిని కట్టడి చేయడం కోసం అధ్యక్షుడు జో బిడెన్ పై రాజకీయంగా వత్తిడి తీసుకు వచ్చేందుకు రిపబ్లికన్ పాలిత రాష్ట్రాల నుండి ఉద్దేశ్యపూర్వకంగా బస్సులలో వలసదారులను డెమోక్రాటిక్ పాలిత ప్రాంతంకు పంపుతున్నారని ఆరోపణలు చెలరేగుతున్నాయి.

More Stories
లాంగ్టాంగ్ పర్వతంపై కొండచరియలు విరగడంతో నేపాల్ జలవిపత్తు!
భగవత్ సభకు భద్రత, హక్కుల బాధ్యత మేయర్ దే
నేపాల్లో జల విలయం.. 165 మంది మృతి