కెనడాలో ఖలిస్థాన్ పై రెఫరెండం అడ్డుకోండి 

కెనడాలోని ఆంటారియాలో వచ్చే నెల 6న ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ ఖలిస్థాన్ పై రెఫరెండం నిర్వహించకుండా అడ్డుకోవాలని, జస్టిన్ ట్రూడో ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత దేశ సమగ్రత, సౌర్వభౌమత్వాన్ని ఈ రెఫరెండం సవాలు చేస్తోందని పేర్కొంది. 

కెనడా హై కమిషన్ సీనియర్ అధికారికి ఈ మేరకు డీమార్చ్ (అధికారిక వినతి/డిమాండ్)ని భారత విదేశాంగ శాఖ అధికారి అందజేశారు. 1985లో ఖలిస్థాని వేర్పాటువాదులు ఎయిర్ ఇండియా విమానం ఖనిష్కను పేల్చివేయడాన్ని ప్రస్తావిస్తూ కెనడాలో  పెరుగుతున్న సిఖ్స్  ఫర్ జస్టిస్ కార్యకలాపాలు, ముఖ్యంగా ఖలిస్థాన్ పై రెఫరెండం నిర్వహించడం  పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ సంస్థను భారత దేశంలో నిషేధించడం గమనార్హం. 

భారత్ కు మిత్రదేశంగా ఉన్న ఓ దేశంలో ఇటువంటి అభ్యంతరకరమైన రెఫరెండం నిర్వహించడం దురదృష్టకరం అని తెలియచేసిన్నట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బగిచి వెల్లడించారు. కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతూ ఉండడం పట్ల భారతీయులకు అక్కడ భద్రత సమస్యగా మారుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యకలాపాలను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని తాము గౌరవిస్తామని కెనడా ప్రభుత్వం సెప్టెంబర్ 16న ప్రకటించడం గమనార్హం.  ఖలిస్థాన్ రెఫరెండాన్ని తాము గౌరవించబోమని తేల్చి చెప్పింది. తొలిసారి రెఫరెండాన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ గత నెల 18న ఆంటారియాలోని బ్రాంప్టన్ లో నిర్వహించగా, రెండో విడత నవంబర్ 6న ఆంటారియా సబర్బన్ లోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనుంది.

రెఫరెండాన్ని అడ్డుకోవాలని భారత్ అధికారికంగా కోరినప్పటికీ, ఈ విషయంలో కెనడా సర్కారు చర్యలు తీసుకోవడం సందేహమే. ఎందుకంటే తమ దేశంలో వ్యక్తులు ఎవరైనా శాంతియుతంగా, చట్టం పరిధిలో తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చన్న విధానానికి ట్రూడో సర్కారు కట్టుబడి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 

అందుకే రెఫరెండాన్ని తాము గుర్తించబోమని, భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని అంటోంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ప్రత్యేక ఖలిస్థాన్ ఉద్యమాన్ని కెనడా వేదికగా నిర్వహిస్తోంది. ఇలా ఉండగా, కెనడాలో పెరుగుతున్న నేరాల సంఖ్య, భారత్ వ్యతిరేక  కార్యక్రమాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సెప్టెంబర్ 23న అక్కడ నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులకు భారత ప్రభుత్వం హెచ్చరికను జారీ చేసింది.