పాక్ సీనియర్ మంత్రిని అపహరించిన ఉగ్రవాదులు 

పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ మంత్రి, ఇమ్రాన్ పార్టీ సీనియర్ మంత్రి అబైద్ ఉల్లా బేగ్‌ను శుక్రవారం ఉగ్రవాదులు అపహరించారు. ఒప్పందం అనంతరం శనివారం ఆయన విడుదలయ్యారు. బేగ్ ఇస్లామాబాద్ నుండి గిల్గిట్‌కు వెళ్తున్న సమయంలో ఆయనను పాకిస్తాన్  రాడికల్ సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రవాదులు అపహరించారు.  

 ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.  జైలులో ఉన్న తమ సహచరులను విడిపించాలన్న డిమాండ్‌తో కూడిన వీడియో క్లిప్‌ను ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన మంత్రి చూపించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన అనంతరం మంత్రి అబైదుల్లా బేగ్ మాట్లాడుతూ  తాను ఇస్లామాబాద్ నుంచి గిల్గిత్ వెళ్తుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. నంగా పర్బత్‌ ప్రాంతంలోగిల్గిత్-బాల్టిస్థాన్ మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ కమాండర్ అయిన హబీబుర్ రెహ్మాన్, అతడి అనుచరులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో థాక్ గ్రామంలో రహదారిని బ్లాక్ చేసి మంత్రిని కిడ్నాప్ చేశారు.

పది మంది పర్యాటకులను హతమార్చినట్టు అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.  రోడ్డును బ్లాక్ చేయడంతో ఇరువైపులా ప్రయాణికులు చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారు.  నంగా పర్బత్ ప్రాంతంలో విదేశీ పర్యాటకుల హత్యతో ప్రమేయమున్న వారితో పాటు డైమర్‌లో ఇతర ఉగ్ర ఘటనల్లో పాల్గొన్న తమ సహచరులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్ చేస్తున్నారు.

అబైద్‌ విడుదలకు ప్రతిగా, టెహ్రీక్-ఇ-తాలిబాన్ కమాండర్ హమీద్ ఉగ్రవాది హబీబ్ ఉర్ రెహ్మాన్‌తో సహా ఆరుగురు ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ఇందుకోసం గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రభుత్వానికి హమీద్ 10 రోజుల అల్టిమేటం ఇచ్చారు. అంతే కాకుండా, గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రావిన్స్‌లో బాలికల క్రీడా కార్యకలాపాలను నిషేధించాలని, ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలని తెహ్రీక్-ఇ-తాలిబాన్ డిమాండ్ చేసింది.

మంత్రి ఉగ్రవాదుల చెరలో ఉన్నప్పుడు గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రభుత్వ మాజీ అధికార ప్రతినిధి ఫైజుల్లా మాట్లాడుతూ తాను అబైదుల్లా బేగ్‌తో మాట్లాడానని, ఆయన విడుదలకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. కాగా, అబైదుల్లా బేగ్ తన ఇంటికి క్షేమంగా చేరుకున్నట్టు పాకిస్థాన్‌ అధికారిక టీవీ చానల్ జియో టీవీ పేర్కొంది. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని హుంజా నుంచి పీటీఐ తరపున బేగ్ ఎన్నికయ్యారు.

ఈ ప్రాంతంలో మతపరమైన హింస పెరగడమే ఈ మొత్తం ఉదంతంకు  కారణమని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. “ఇటీవలి కాలంలో న్వే ర్పాటువాద ఉద్రిక్తతలు ప్రస్తుత పరిస్థితికి దారితీశాయి, పరిస్థితి త్వరలో పరిష్కరించబడుతుందని మేము ఆశిస్తున్నాము” అని పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం, తెహ్రీక్-ఇ-తాలిబాన్ చాలా కాలంగా తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. గిల్గిత్-బాల్టిస్థాన్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయితే ఉగ్రవాదుల డిమాండ్లు నెరవేరాయా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.