24 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24 శాతం వృద్ధిని నమోదు చేసి, రూ.8.98 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే కార్పొరేట్‌ ఆదాయంపై వసూళ్లు 16.74 శాతం పెరిగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 32.30 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది.

ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 8.98 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో వసూలైన పన్నుల కంటే 3.8శాతం ఎక్కువ. రీఫండ్స్‌ సర్దుబాటు చేసిన తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా ఉన్నాయని, గత సంవత్సరం ఇదే కాలానికి వసూళ్లు చేసిన దానికంటే 16.3 శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

వస్తువుల ఎగుమతుల్లో గతేడాది నమోదైన వృద్ధి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిలిచిపోయింది. కమోడిటీ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.5 శాతం క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే వాణిజ్య లోటు దాదాపు రెట్టింపు అయ్యింది. జూలైలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి 2.4 శాతానికి తగ్గింది. అదే సమయంలో, ప్రాథమిక పరిశ్రమ వృద్ధి ఆగస్టులో తొమ్మిది నెలల కనిష్ట స్థాయి 3.3 శాతానికి పడిపోయింది.