ర‌ష్యా నుంచి ఇంధ‌నం కొన‌వ‌ద్దు అని ఎవ‌రూ చెప్ప‌లేదు

ఏ దేశం నుంచైనా ఇంధ‌నాన్ని కొనుగోలు చేయ‌డానికి భార‌త్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంద‌ని కేంద్ర పెట్రోలియం శాఖ హ‌ర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ర‌ష్యా నుంచి ఇంధ‌నాన్ని కొన‌వ‌ద్దు అని ఏ దేశం కూడా త‌మ‌కు చెప్ప‌లేద‌ని మంత్రి తెలిపారు. భార‌త్‌లో ఉన్న జ‌నాభా దృష్ట్యా, ఇక్క‌డ ఉన్న వినియోగం దృష్ట్యా,  ఈ నేప‌థ్యంలో ఎవ‌రి నుంచైనా ఇంధ‌నాన్ని కొంటామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

మ‌న విధానాల ప‌ట్ల స్ప‌ష్ట‌మైన అవగాహ‌న ఉండాల‌ని, ఇంధ‌న భ‌ద్ర‌త‌, ఇంధ‌నం ఖ‌రీదు చేసే స్థోమ‌త విష‌యాల‌ను ఆలోచిస్తే, అప్పుడు ఎక్క‌డి నుంచైనా ఇంద‌నం కొంటామ‌ని మంత్రి పురి తెలిపారు. భారత్ తమ పౌరులకు ఇంధనాన్ని అందించడం నైతిక బాధ్యత అని చెప్పారు. అమెరికా ఇంధనశాఖ కార్యదర్శి జెన్నిఫర్ గ్రాన్‌హోమ్‌తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. ఇంధనం ఖరీదుతో పాటు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇంధనం కొనుగోలు ఉంటుందని చెబుతూ  తమ విధానల పట్ల స్పష్టమైన అవగాహన ఉందని స్పష్టం చేశారు. 

ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు, వ్యాపారులపై పడిందని చెబుతూ ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసిందని హర్దీప్ చెప్పారు. 

రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు ఏప్రిల్ నుంచి 50 రెట్లు పెరిగాయని పేర్కొంటూ ఇది భారత్ విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురులో 10 శాతం ఉందని తెలిపారు. అయితే, ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ముందు రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురు కేవలం 0.2 శాతం మాత్రమే అని తెలిపారు.