ఆ నాలుగు దగ్గు మందులూ భారత్ లో లేవు 

 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) ఆరోపించిన నాలుగు దగ్గు మందులూ భారత్‌లో అందుబాటులో లేవని ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌ అండ్‌ డిస్టిబ్యూటర్స్‌ (ఎఐఒసిడి) వెల్లడించింది. భారత్‌లోని మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయరు చేసిన దగ్గు మందులు వాడి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారని డబ్ల్యూహెచ్‌ఒ బుధవారం పేర్కొంది. 
 
ప్రోమెథజిన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్షమలైన్‌ బేబీ కాఫ్‌ సిరఫ్‌, మేకాఫ్‌ బేబీ కాఫ్‌ సిరఫ్‌, మాగ్రిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిరఫ్‌లపై డబ్ల్యూహెచ్‌ఒ ఆరోపణలు చేసింది. ఈ దగ్గు మందులు దేశంలో అందుబాటులో లేవని ఎఐఒసిడి తెలిపింది. ఒక వేళ ఈ మందులు భారత్‌ మార్కెట్‌లో ఉన్నట్లయితే, వాటి సరఫరాను తక్షణమే నిలిపివేస్తామని డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియాకు హామీ ఇచ్చింది.
 
 ‘మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ ఉనికి భారత్‌లో లేదు. ఈ కంపెనీ తన ఉత్పత్తులను కేవలం ఎగుమతి మాత్రమే చేస్తుంది’ అని ఎఐఒసిడి తెలిపింది. మరోవైపు డబ్ల్యూహెచ్‌ఒ హెచ్చరికలపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఈ నాలుగు రకాల దగ్గు మందుల ఎగుమతికి అనుమతి ఉన్నదని, అయితే భారత్‌లో అమ్మకం, మార్కెటింగ్‌కు అవి అందుబాటులో లేవని డీసీజీఏ స్పష్టం చేసింది. 
 
దగ్గు మందులతో ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది పిల్లలు మృతిచెందటంతో డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఏ) అప్రమత్తమైంది. ఆ మరణాలపై విచారణ ప్రారంభించింది. హర్యానాలోని ఓ కంపెనీ తయారు చేసిన 4 రకాల దగ్గు మందులను వాడటం వల్లే గాంబియాలో చిన్నారులు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్నది. 
 
ఇదే విషయాన్ని తమ దృష్టికి కూడా తీసుకు రావడంతో డీసీజీఏ  భారత్‌లో తయారైన దగ్గు మందుల వల్లే చిన్నారులు మరణించారనడానికి ఆధారాలు సమర్పించాలని డబ్ల్యూహెచ్‌వోకు సూచించింది.  మరోవైపు హర్యానా ప్రభుత్వం ఈ నాలుగు రకాల దగ్గు మందుల శాంపిల్స్‌ను సేకరించింది. వీటిని కోల్‌కతాలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబొరేటరీకి పంపింది. వీటిని పరీక్షించి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది.
 
 మందులపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ మాట్లాడుతూ ‘భారత్‌లో తయారైన దగ్గు మందుల వల్లనే గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించినట్టు అనుమానాలున్నాయి. దీనిపై దర్యాప్తు జరుపుతున్నాం. భారత్‌కు చెందిన డీసీజీఏతోనూ కలిసి పనిచేస్తున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతానికి ఆ మందులను గాంబియాలోనే గుర్తించామని, ఇతర దేశాలకూ సరఫరా అయ్యి ఉండొచ్చని పేర్కొన్నారు.