సిసోడియా ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ సోదాలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి దేశవ్యాప్తంగా శుక్రవారం దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్లోని 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తోంది. 

ఈ రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్వర్క్కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇటు హైదరాబాద్‌లో ఈడీ నాలుగు చోట్ల తనిఖీలు చేస్తోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు జూబ్లీహిల్స్, కూకట్‌పల్లితో పాటు మరో రెండుచోట్ల సోదాలు చేస్తున్నట్లు సమాచారం.  

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముఖ్య అనుచరుడు దినేష్ అరోరా ఇల్లు, ఆఫీసుతో పాటు స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. దినేష్‌ అరోరాకు చెందిన అకౌంట్‌లోకి రూ. కోటి నగదు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. రాధాకృష్ణ ఇండస్ట్రీస్ ద్వారా దినేష్‌ అరోరా యూకో బ్యాంక్‌ లోకి నగదు బదిలీ అయినట్టు గుర్తించారు. 

సమీర్‌ మహేంద్రు రూ. కోటి బదిలీ చేసినట్టు తేలింది. ఇప్పటికే దినేష్ అరోరాపై సీబీఐ కేసు నమోదు చేసింది. దినేష్ అరోరా డబ్బులు మనీష్‌ సిసోడియాకు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. సమీర్‌ మహేంద్రు, అర్జున్‌ పాండే, విజయ్‌ నాయర్‌, రామచంద్రపిళ్లైలకు రూ. 5 కోట్లు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. 

ఈడీ కస్టడీలో ఉన్న సమీర్‌ మహేంద్రు స్టేట్‌మెంట్‌తో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో రెండు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహించనుంది. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్‌లలో సుమారు 35 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ తెల్లవారు జాము నుంచే సోదాలు చేపట్టినట్లు ఈడీ కేంద్ర కార్యాలయ వర్గాల వెల్లడించాయి.