అసెంబ్లీని రద్దు చేసి బీఆర్ఎస్ తో ఎన్నికలకు  రావాలే!

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి బీఆర్ఎస్ తో ఎన్నికలకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ కు సవాలు విసిరారు.  కేసీఆర్ పెట్టిన కొత్త పార్టీ బీఆర్ఎస్ కు జెండా లేదు, అజెండా లేదు అని విమర్శించారు. అసలు ఏ ఉద్దేశంతో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 
 
టీఆర్ఎస్ పార్టీ పేరు మీద గెలిచి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇవాళ ఏ రకంగా పార్టీ పేరును మారుస్తారంటూ ప్రశ్నించారు. పార్టీ పేరును మార్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉన్నదన్న సంజయ్… పార్టీ పేరును మారుస్తున్నందుకు ఆయనకు ఎంత మాత్రం అధికారంలో ఉండే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. 
 
కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. గతంలో జాతీయ పార్టీలను తిట్టిన కేసీఆర్… ఇవాళ ఏ మొఖం పెట్టుకొని జాతీయ పార్టీ అని అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా అని ప్రశ్నించిన సంజయ్… గేదేకు సున్నమేసినంత మాత్రానా ఆవు కాదు అంటూ ఎద్దేవా చేశారు. 
 
కేసీఆర్ అక్రమ సంపాదన గురించి ప్రజలకు అర్థమైందని, ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ నాటకమాడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు కేసీఆర్ కేబినేట్ లో ఒక్క మహిళ కూడా లేరని, కానీ ఇవాళ ఆయన మహిళా సాధికారిత అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో విమానం కొన్న ఖ్యాతి కేసీఆర్, కేఏ పాల్ కే దక్కిందన్న సంజయ్… త్వరలో ఆ ఇద్దరు నాయకులు కలిసి పని చేస్తారేమో అని ఎద్దేవా చేశారు. 
 
తెలంగాణ మోడల్ దేశానికి అవసరమట.. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజలను కలవకుండా ఫాంహౌజ్ కు పరిమితమవడమే తెలంగాణ మోడలా? ప్రజలను కలవకుండా, సచివాలయానికి రాకుండా రాత్రింబవళ్లు తాగి పండటమే దేశానికి ఆదర్శమా? అంటూ  ప్రశ్నించారు. 
 
తెలంగాణ రైతులు అరిగొస పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే… వాళ్లను గాలికొదిలేసి తెలంగాణ పైసలు తీసుకుపోయి ఎక్కడో పంజాబ్ లో ఖర్చు పెట్టడమే తెలంగాణ మోడలా? అంటూ నిలదీశారు.  ఇక్కడ ఉద్యోగులకు జీతాలే ఇయ్యడం చేతగాక వాయిదాల పద్దతిలో రోజుకో జిల్లాలో జీతాలేయడమే తెలంగాణ మోడలా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇక్కడ లక్షలాది మంది నిరుద్యోగులను రోడ్డుపాల్జేసి నీ కుటుంబం కొత్త ఉద్యోగం కోసం దేశమ్మీద పడటమే నీ తెలంగాణ మోడలా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 
 “ఏ తెలంగాణ అస్తిత్వం కోసం నువ్వు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టానని చెప్పినవో ఆ తెలంగాణ అస్థిత్వం పేరుతో 8 ఏండ్ల పాటు తెలంగాణను దోచుకుతిన్నవ్. రాష్ట్రాన్ని అప్పులు పాల్జేసినవ్. నీ కుటుంబాన్ని మాత్రం దేశంలోనే నెంబర్ వన్ రాజకీయ సంపన్న కుటుంబంగా మార్చుకున్నవ్. నీ భాగోతం అర్ధమై ప్రజలు నీ పార్టీనీ చీత్కరిస్తున్నరు. ఇగ తెలంగాణల నీ పప్పులుడకవని తెలిసి… దేశమ్మీద పడి దోచుకోవాలనుకుంటున్నవ్” అంటూ ధ్వజమెత్తారు.
 
ఇన్నాళ్లూ తెలంగాణ నుండి వెళుతున్న సొమ్ములో కేంద్రం తిరిగి 45 పైసలే ఇస్తుందని చెప్పినవ్ కదా… జాతీయ పార్టీగా ఇప్పుడు తెలంగాణ నుండి వెళుతున్న సొమ్ములో తిరిగి ఎంతిస్తవో చెప్పే దమ్ముందా? అని సంజయ్ సవాల్ చేశారు. దేశం పేరుతో పార్టీ పెట్టినంత మాత్రాన జాతీయ పార్టీ అవుతుందా? ఏఐఏడీఎంకే, ఆర్జేడీ, జేడీఎస్, ఎన్సీపీ పార్టీలు కూడా ఇట్లనే అనుకుని కనుమరుగైపోయినయ్ అని గుర్తు చేశారు.