రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు

 కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్  ట్విటర వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్‌కు తన వ్యాఖ్యలతో సంబంధం లేదని ఉదిత్ స్పష్టం చేశారు. జాతీయ మహిళా కమీషన్ ఈ వాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలని ఉదిత్ రాజ్ కు పంపిన నోటిస్ లో డిమాండ్ చేసింది. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం గాంధీనగర్‌లో ఆమె గౌరవార్థం గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పాల ఉత్పత్తి, వినియోగంలో భారతదేశం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. పాడి రైతుల సహకార సంఘాలు పాల ఉత్పత్తిలో పోషించిన పాత్ర వల్ల ఈ ఘనత మనకు దక్కిందని పేర్కొన్నారు. 

అదే విధంగా, దేశం వినియోగించే ఉప్పులో 76 శాతం గుజరాత్‌ ప్రభుత్వ ఉత్పత్తి చేస్తోందని ఆమె చెప్పారు. గుజరాత్‌ నుండి వచ్చే ఉప్పుని దేశప్రజలందరూ వినియోగిస్తున్నారని తెలిపారు.   దీనిపై ఉదిత్ రాజ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ద్రౌపది ముర్ము వంటి రాష్ట్రపతి ఏ దేశానికీ ఉండకూడదని అంటూ అనుచితంగా వాఖ్యలు చేశారు.

చెమ్చాగిరి చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని పరుషపదజాలం ఉపయోగిస్తూ 70 శాతం మంది ప్రజలు గుజరాత్ ఉప్పు తింటున్నారని ఆమె చెప్తున్నారని దుయ్యబట్టారు. జీవితమంతా మీరు ఉప్పు తింటూనే జీవిస్తే, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఉదిత్ రాజ్ వ్యాఖ్యలు ఓ మహిళకు వ్యతిరేకంగా ఉండటం మాత్రమే కాకుండా, రాజ్యాంగ అధిపతికి వ్యతిరేకంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆమె మహిళ అయినందువల్ల లక్ష్యంగా చేసుకున్నారా? అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవని చెబుతూ ఆయనకు తాము నోటీసు ఇచ్చామని తెలిపారు. ఆయన అవమానకరంగా మాట్లాడారని, ఆయన ఉపయోగించిన భాష సిగ్గుచేటు అని చెప్పారు. 

ఉదిత్ రాజ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా  స్పందిస్తూ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని అవమానించే చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రయోగించిన భాష అన్ని హద్దులను మీరిందని చెప్పారు.

బీజేపీ నేత టామ్ వడక్కన్ స్పందిస్తూ, ఉదిత్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పదవిని అందరూ గౌరవించాలని హితవు చెబుతూ ఆ పదవిని నిర్వహిస్తున్నవారిపై ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గిరిజన వ్యతిరేక ధోరణికి ఈ వాఖ్యలు అద్దం  పడుతున్నాయని బిజెపి నేత సంబిత్ పాత్ర ధ్వజమెత్తారు, కాగా, తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఉదిత్ రాజ్ స్పందిస్తూ, రాష్ట్రపతి ముర్ముపై తన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని చెప్పారు. తాను వ్యక్తిగతంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.

ఇలా ఉండగా, ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదు. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి జూలైలో మాట్లాడుతూ, ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొన్నారు. దీంతో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధిర్ రంజన్ దిగి వచ్చి, క్షమాపణ చెప్పారు.

రాష్ట్రపతిని ఈవిల్‌ అంటూ అజోయ్  కుమార్‌ వ్యాఖ్యానించారని, అలాగే అధిర్‌ రంజన్‌ చౌదరి రాష్ట్రపత్ని అంటూ గతంలో విమర్శించారని .. మరోసారి కాంగ్రెస్‌ తన స్థాయి తగ్గేలా వ్యవహరించిందని పూనావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.