‘ఆదిపురుష్’ను తక్షణం నిషేధించాలి

 ఓం రౌత్ నిర్మిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ను నిషేధించాలని అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. రావణుడిని చూపించిన తీరు పూర్తిగా తప్పు, ఖండించదగినదని తెలిపారు. అయోధ్యలో ఏటా నిర్వహించే రథయాత్ర సందర్భంగా  ఆయన ఈ డిమాండ్ చేశారు. 
శ్రీరాముడిని, హనుమంతుడిని ఇతిహాస రామాయణంలో వర్ణించినట్లుగా ఈ బాలీవుడ్ సినిమాలో చూపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి గౌరవమర్యాదలకు విరుద్ధంగా చూపిస్తున్నారని పేర్కొన్నారు.  1.46 నిమిషాల నిడివిగల ‘ఆదిపురుష్’ టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ప్రభాస్ పోషించగా, రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు.
రావణాసురుడిని ఇస్లామీకరణ చేశారని అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు. హనుమంతుడిని మీసాలు లేకుండా గెడ్డాలు పెట్టి, చర్మం ధరించినట్లు చూపించడాన్ని కూడా తప్పుబడుతున్నారు. వీఎఫ్ఎక్స్ కూడా పేలవంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.  ఈ సినిమా 2023 జనవరి 12న విడుదలవుతుంది.
మహారాష్ట్రలో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటాం
 
మరోవంక, ఆదిపురుష్ చిత్రాన్ని మహారాష్ట్రలో ప్రదర్శించనీయబోమని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ హెచ్చరించారు. ‘‘మరోసారి మా దేవుళ్లు, దేవతలను చౌక ప్రచారం కోసం సినిమా నిర్మాతలు ఆదిపురుష్ సినిమాలో కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరిచారు’’అని బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘‘ఈ విడత క్షమాపణలు చెప్పడమో, సదరు సీన్లను కత్తిరించడమో చేస్తే చాలదు. ఆ విధమైన ఆలోచనలకు గుణపాఠం చెప్పేందుకు వీలుగా, అటువంటి సినిమాలను పూర్తిగా నిషేధించాల్సిందే’’అని రామ్ కదమ్ స్పష్టం చేశారు.