అందర్నీ ప్రేమించాలన్నదే ‘అలయ్ బలయ్’ ఉద్దేశం

దసరా సందర్భంగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఇతివృత్తంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా తీయాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ మంచి సంస్కృతి సంప్రదాయాలు  కలిగిన రాష్ట్రం అని కొనియాడారు. దత్తన్న ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమం అద్భుతం అని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు నుండి మనం ప్రేరణ పొందాలని సూచించారు. మన వాళ్లనే కాదు అందరిని ప్రేమించాలనే తత్వం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అని వివరించారు. మనుసులంతా ఒక్కటే అని సిద్ధాంతాన్ని అందరూ పాటించాలని కేరళ గవర్నర్ కోరారు.
 
 అలయ్.. బలయ్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.  రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు. తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకుని, విజయదశమి తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలతో.. ఆలింగనం చేసుకుంటూ ‘అలయ్ బలయ్’ చెప్పుకుంటారు. 
 
తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా జరిగే ఈ కార్యక్రమాన్ని సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 2005 నుంచి ఏటా దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈఏడాది ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
 
అలయ్‌ బలయ్‌ వేడుకల్లో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దత్తాత్రేయ కుటుంబం 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోండటం గొప్ప విషయమని, ఇలాంటి మంచి ప్రోగ్రామ్‌లు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా, రాజకీయాలకు అతీతంగా జరిగే ఆత్మీయ కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. చిరంజీవి డప్పుకొడుతూ అందరిలో హుషారును నింపారు.
 
  ‘‘ ప్రతిసారిలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ సంస్కృతిని అందరికి గుర్తు చేసేందుకు అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించాం.ఈసారి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నం. రుచికరమైన వంటకాలను తయారు చేయించాం’’ అని  విజయలక్ష్మి తెలిపారు.
 
కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్,  మాజీ ఎంపీలు జీ వివేక్, వీ హనుమంతరావు, మాజీ మంత్రి బాబూ మోహన్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.