అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించిన హిమాచల్ 

గత ఎనిమిదేళ్లలో హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో  పార్టీకి ప్రజలు ఓటు వేయడం వల్లననే ఇంతటి విశేష అభివృద్ధి సాధ్యమైనదని చెబుతూ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌కు  ప్ర‌జ‌ల ఓటే కార‌ణమని స్పష్టం చేశారు. 
 
హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని జాతీయ రహదారి నం.105పై పింజోర్ నుంచి నలగఢ్ మధ్య 31 కిలోమీటర్ల మేర రూ.1,690 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే బిలాస్‌పూర్లో నిర్మించిన ‘ఎయిమ్స్‌’ను ప్రధాని జాతికి అంకితం చేయడంతోపాటు నలగఢ్‌లో రూ.350 కోట్ల‌తో నిర్మించే వైద్య పరికరాల పార్కుకు శంకుస్థాప‌న చేశారు. మరోవైపు బాంద్లాలో ప్రభుత్వ హైడ్రో ఇంజినీరింగ్ కళాశాలను ప్రధాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ విద్య, రోడ్లు, పరిశ్రమలు, ఆస్పత్తులు వంటి సౌకర్యాలు పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమనే భావన చాలాకాలం కొనసాగిందని తెలిపారు.  కొండ ప్రాంతాల విషయంలో కనీస సౌకర్యాలు కూడా చిట్టచివరన మాత్రమే వచ్చేవని గుర్తుచేశారు. పర్యవసానంగా దేశ ప్రగతిలో తీవ్ర అసమతౌల్యం ఏర్పడిందని చెబుతూ హిమాచల్‌ ప్రజలు ప్రతి చిన్న అవసరానికీ అటు చండీగఢ్ లేదా ఇటు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేదని పేర్కొన్నారు. 

అయితే, గత 8 ఏళ్లలో డబల్ ఇంజిన్  ప్రభుత్వం పరిస్థితులను సమూలంగా మార్చేసిందని చెప్పారు. ఇవాళ ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కూడా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ స‌మ‌కూర్చుకున్నద‌ని చెబుతూ దేశంలో వైద్య విద్యకు సంబంధించి అగ్రస్థానంలోగల ‘ఎయిమ్స్‌’ ఇక బిలాస్‌పూర్‌ కీర్తిని మరింత ఉజ్వలం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. 

ప్రభుత్వం పనిచేసే ధోరణి పూర్తిగా మారిందని చెబుతూ  ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే నిర్దిష్ట వ్యవధితో నేడు వాటికి పునాది పడుతుండటమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. దేశ ప్రగతిలో హిమాచల్‌ ప్రదేశ్‌ పాత్రను వివరిస్తూ  ‘దేశ రక్షణ’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘ఎయిమ్స్’తో ఇకపై ‘ప్రాణరక్షణ’లోనూ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

కరోనా మహమ్మారి సవాలు విసిరినప్పటికీ ‘ఎయిమ్స్‌’ నిర్మాణం సకాలంలో పూర్తి కావడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటుకు ఎంపికైన మూడు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి కావడం గర్వించదగిన తరుణమని ప్రధాని పేర్కొన్నారు. 

 అలాగే వైద్య పరికరాల తయారీ పార్కు కోసం ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాల్లో హిమాచల్‌లో ఒకటి కాగా, ఇందులో భాగంగా  నలగఢ్‌లో పార్కుకు శంకుస్థాపన పూర్తయిందని తెలిపారు. వైద్య పర్యాటక అభివృద్ధికి సంబంధించి హిమాచల్‌ ప్రదేశ్‌కు అపార అవకాశాలున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇక్కడి గాలి, పర్యావరణం, ఔషధ మొక్కల లభ్యత వగైరాలన్నీ  రాష్ట్ర ఇతోధిక ప్రయోజనాలకు వనరులు కాగలవని చెప్పారు. 

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల జీవన సౌలభ్యం దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాల్లో ఆస్పత్రుల ఏర్పాటు, తద్వారా వైద్య ఖర్చుల తగ్గింపు ప్రయత్నాల గురించి వివరించారు. ఈ మేరకు ‘ఎయిమ్స్‌’ నుంచి జిల్లా ఆస్పత్రులలో ప్రాణరక్షక చికిత్స, గ్రామాల్లో శ్రేయో కేంద్రాలకు నిరంతర సంధానం కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పారు. 

ఆయుష్మాన్ భారత్ పథకం రాష్ట్రంలోని చాలా కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల దాకా ఉచిత చికిత్స సదుపాయం అందిస్తోందని ప్రధాని తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా చికిత్స పొందిన 3 కోట్ల మందిలో హిమాచల్‌ వాసులు 1.5 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా ప్రభుత్వం రూ.45,000 కోట్లకు పైగా ఖర్చు చేయడంతో రోగులకు రూ.90,000 కోట్ల దాకా ఆదా అయిందని పేర్కొన్నారు.