పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం

పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని తుడిచి పెడుతుందని, దేశంలో అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మార్చుతుందని భరోసా ఇచ్చారు.
బారాముల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, జమ్మూ కశ్మీరులో 1990వ దశకం నుంచి ఉగ్రవాదం వల్ల 42,000 మంది ప్రాణాలు కోల్పోయారని, ఉగ్రవాదం వల్ల ఎవరైనా లబ్ధి పొందారా? అని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీరు అభివృద్ధిలో వెనుకబడటానికి మూడు కుటుంబాలే కారణమని ఆయన దుయ్యబట్టారు.
అబ్దుల్లాలు (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీలు (పీడీపీ), నెహ్రూ-గాంధీలు (కాంగ్రెస్) వల్ల  అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని వీరే పరిపాలించారని పేర్కొంటూ వీరి పాలన అవినీతిమయమని మండిపడ్డారు. ముఫ్తీలు, అబ్దుల్లా కుమారులు,కాంగ్రెస్ పార్టీలు ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని కొందరు అంటున్నారని చెబుతూ ఆ దేశంతో మనం ఎందుకు చర్చలు జరపాలని అమిత్ షా ప్రశ్నించారు. మనం చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. మనం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం అని తెలిపారు.
 
 ‘‘మమ్మల్ని పాకిస్తాన్ తో మాట్లాడమన్నారు…కానీ మేం కశ్మీర్ ప్రజలతో మాత్రమే మాట్లాడతామని చెప్పాం’’ అని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా పూర్తయ్యాక జమ్ము కశ్మీర్ లో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.  70 ఏండ్ల పాటు పరిపాలించిన ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలు పేదలకు లక్ష ఇళ్ళను కూడా నిర్మించలేకపోయాయని చెబుతూ మోదీ హయాంలో గత 8 ఏళ్లలో లక్ష ఇళ్ళను అందించినట్టు ఆయన చెప్పారు    
 
ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదని, దానిని తుదముట్టిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది తమ లక్ష్యమని చెప్పారు.  
 
కొందరు తరచూ పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారని, అయితే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఎన్ని గ్రామాలకు విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని అమిత్ షా ప్రశ్నించారు. మన ప్రభుత్వం కశ్మీరులోని అన్ని గ్రామాలకు విద్యుత్తు కనెక్షన్లను ఇచ్చిందని ఆయన తెలిపారు. 
ఉగ్రవాద కట్టడికై మరింత సమన్వయం
సుసంపన్నమైన, శాంతియుతమైన జమ్మూ కాశ్మీర్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడానికి, సమన్వయంతో కూడిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చురుకుగా నిర్వహించాలని అమిత్ షా భద్రతా బలగాలను, పోలీసులను కోరారు.
జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలపై శ్రీనగర్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తూ  జమ్మూ   కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమైన వీధులను హింసాత్మక చర్యలు లేకుండా ఉంచేందుకు, చట్ట పాలనను గణనీయంగా పునరుద్ధరించడానికి భద్రతా సంస్థలు, పరిపాలన చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ‘హర్‌ఘర్‌తిరంగా’ ప్రచారంలో అపూర్వమైన ఉత్సాహం కనిపించిందని కొనియాడారు.

ఉగ్రవాదులు, వేర్పాటువాదుల భయం లేకుండా ఉండేలా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని హోంమంత్రి ఆదేశించారు. భద్రతా గ్రిడ్ పనిని, వ్యవస్థపై వేర్పాటువాద నెట్‌వర్క్‌లను ఉక్కిరిబిక్కిరి చేయడం, ఉగ్రవాద సంఘటనలను తగ్గించడానికి మునుపటి సమావేశాలలో భద్రతా ఎజెండాలోని వివిధ అంశాలపై సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు.

తీవ్రవాదాన్ని తుడిచి పెట్టేందుకు సునిశితమైన,  ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల ద్వారా సమన్వయంతో కూడిన ప్రయత్నాలను కొనసాగించాలని అమిత్ షా భద్రతా బలగాలను,  పోలీసులకు ఉద్బోధించారు. యుఎపిఎ కింద నమోదైన కేసులను కూడా సమీక్షిస్తూ దర్యాప్తు సకాలంలో, సమర్థవంతంగా ఉండాలని స్పష్టం చేశారు.