బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మరో డ్రామా… బిజెపి ఎద్దేవా

టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ, ఇక తమది జాతీయ పార్టీ అంటూ ఆ పార్టీ అధినేత ప్రకటించడాన్ని మరో డ్రామాగా బిజెపి అభివర్ణించింది.  కేసీఆర్…బీఆర్ఎస్ సంగతి దేవుడెరుగు, అసలు నీ టీఆర్ఎస్ పార్టీ అస్థిత్వమే పోయిందని అంటూ ఎద్దేవా చేసింది.
బీఆర్ఎస్ కు మునుగోడు ఎన్నికల ఫలితాలతోనే ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వబోతున్నరని అంటూ బిజెపి నాయకులు స్పష్టం చేశారు. నాడు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఛీ కొడుతుండటంతో దేశ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ చేస్తున్న కొత్త డ్రామాలు ప్రజలకు అర్ధమైనయ్ అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ స్పష్టం చేశారు.

భారత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతంగా అత్యంత అవినీతి మోడల్ పాలనను చూపించిన దుర్మార్గుడు కేసీఆర్ అంటూ  8 ఏండ్లలో అవినీతి ద్వారా సంపాదించిన పైసలతో కేసీఆర్ నేల మీద నిలబడటం లేదని ఆమె ధ్వజమెత్తారు. అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి అన్ని రాష్ట్రాల్లో గెలవాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నడని చెబుతూ అది ఎన్నటికీ సాధ్యం కాదని ఆమె తేల్చి చెప్పారు. 
 
కేసీఆర్ 8 ఏండ్ల పాలన ఘోర వైఫల్యం అంటూ సచివాలయమే వెళ్లని సీఎంగా భారత చరిత్రలో కేసీఆర్ నిలిచిపోయిండని ఆమె కితాబు ఇచ్చారు. జాతీయ పార్టీ పెట్టి ఇదే మోడల్ చూపించాలనుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించారు.
కాలం చెల్లిన నేతల ఏకీకరణ 
బిఆర్ఎస్ రాజకీయ పునరేకీకరణ కానే కాదని, వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నిరుద్యోగుల, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమే అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు.  తెలంగాణలో దోచుకున్న సొమ్ము లెక్క చెప్పలేక తన సొంత షోకుల కోసం ఖర్చు పెట్టడానికి ఆడుతున్న డ్రామాలివి అని ఆయన మండిపడ్డారు.
 
మునుగోడు ఎన్నికల నుండి రాష్ట్ర ప్రజలను మళ్ళించే ఉద్దేశంతో కేసీఆర్ చేస్తున్న విన్యాసాలను ప్రజలకు అర్ధమైందని చెబుతూ మునుగోడు బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం అని తేల్చి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు నూకలు చెల్లినయ్, అందుకే బీఆర్ఎస్ పేరుతో మరో కొత్త డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
కేసీఅర్ 8 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏంటో ముందు చెప్పాలని ఆయన నిలదీశారు.  ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు పాల్జేసి యావత్ రాష్ట్రాన్ని బ్యాంకులకు, కార్పొరేషన్లకు కుదువ పెట్టిన కేసీఆర్…. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా? అని ప్రశ్నించారు.
 తెలంగాణకు కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయింది 
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణకు సీఎం కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యమ పార్టీని ఖతం చేసి, ఉద్యమకారులను మర్చిపోయేటట్టు చేసి, కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని ఆయన  చెప్పారు.
బిఆర్ఎస్ పార్టీ స్థాపనతో తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్ కి ఉన్న బంధం తెగిపోయిందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తరువాత ఆయన నమ్ముకున్నది మద్యాన్ని, డబ్బుని, ప్రలోభాలనే అని ఈటల ఆరోపించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయ చెలామణి చేయాలని పగటి కల కంటున్నారని ధ్వజమెత్తారు.  ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు. 
 
తెలంగాణలో సమస్యలు పరిష్కరించలేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పారు. ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేసీఆర్ ఇబ్బంది పడుతుంటే, ఆ బాధను దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఎద్దేవా చేశారు. 
 
కేసీఆర్  స్వీయ విధ్వంసమే 
జాతీయ రాజకీయ ప్రవేశానికి ప్రణాళికలు సిద్ధం చేయడంలో సిఎం కేసీఆర్ దుస్సాహసంగా వ్యవహరిస్తున్నారని అంటూ ఇది కేసీఆర్  స్వీయ విధ్వంసమేనని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు హెచ్చరించారు. 
 
ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ ఆశయాన్ని పెంచుకోవడం ఇదే మొదటిసారి కాదని, 1947 నుంచి అనేక ప్రాంతీయ పార్టీలు ప్రయత్నించి విఫలమయ్యాయని ఆయన గుర్తు చేశారు.  ఏఐడీఎంకే, డీఎంకే, టిడిపి, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ, టిఎంసి, తాజాగా ఆప్ వంటివి జాతీయ పార్టీలు కావడానికి విఫల ప్రయత్నాలు చేశాయని తెలిపారు. 
 
టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడం ద్వారా ఒక పార్టీ జాతీయ పార్టీగా ఎలా అవతరిస్తుంది? అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే బహుళ రాష్ట్రాల్లో గణించదగిన ఓటరు మద్దతు పొందాలని చెప్పారు.
 
‘తెలంగాణ మోడల్’ లేదని, అది కేవలం సీఎం కేసీఆర్ కల్పిత ఊహలోనే ఉందని బీజేపీ విశ్వసిస్తోందని ఆయన తెలిపారు.  ఉనికిలో లేని మోడల్‌ను దేశానికి విక్రయించలేరని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడం వల్ల తన సొంతగడ్డను కోల్పోవాల్సి వస్తుందని చెబుతూ, అదే సమయంలో ఆయన వ్యర్థమైన జాతీయ ఆశయానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.