మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ పేరుపై టిఆర్ఎస్ లో గందరగోళం

రెండు దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీగా దేశంలో ఓ విధమైన గుర్తింపు తెచ్చుకున్న టిఆర్ఎస్ ను ఇప్పుడు జాతీయ పార్టీగా పేరు కూడా బిఆర్ఎస్ గా మార్చడంతో ప్రస్తుతం జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీ పేరుతో పోటీ చేయాలన్నది ఆ పార్టీ నేతలలో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు కనిపిస్తున్నది.

ఇప్పటి వరకు జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్న అనేక ప్రాంతీయ పార్టీలు పేరుకు ముందు `అఖిల భారత’ అని జోడించడం మినహా అసలు పేరులో ఎటువంటి మార్పు చేయలేదు. దానితో వారికి చెప్పుకోదగిన ఇబ్బందులేమీ కలగలేదు. ఇప్పుడు జెండా, ఎన్నికల గుర్తులను మార్చక పోయినప్పటికీ ఇంత తక్కువ వ్యవధిలో పేరు మారిస్తే ఓటర్లలో గందరగోళం కలిగించే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

టీఆర్ఎస్‌‌ను బీఆర్ఎస్‌‌గా మార్చుతూ చేసిన తీర్మానాన్ని సీఈసీ వెంటనే ఆమోదిస్తుందని, బీఆర్ఎస్ పేరుతో ఉపఎన్నికలో పోటీ చేస్తామని మొదట్లో ప్రకటించిన నేతలు  తీరా సీఈసీని కలిసిన తర్వాత అస్పష్టతకు గురవుతున్నట్లు చెబుతున్నారు.  ఒకవేళ భారత్ రాష్ట్ర సమితి పేరుతో ఇంకెవరైనా దరఖాస్తు చేసుకొని ఉంటే పేరు మార్పు అంత సులభం కాదు. 

అలాగే బీఆర్ఎస్ పేరుతో దేశవ్యాప్తంగా కొత్త పార్టీ ఏర్పాటవుతున్నట్టు కనీసం రెండు జాతీయ స్థాయి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఫ్రీ సింబల్‌‌గా ఉన్న కారు గుర్తు కేటాయింపుపైనా అభ్యంతరాలు తీసుకోవాలి. 

ఇదంతా క్రమపద్ధతిలో చేయాల్సిన ప్రక్రియ అని, అనుకున్నంత సులువుగా పూర్తి కాదని టీఆర్ఎస్ నేతలు పలువురు ఇప్పటికే గ్రహించారు.  దానితో మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేయక తప్పదని, బీఆర్ఎస్‌‌గా పేరు అధికారికంగా మార్చుకునేందుకు ఎక్కువ సమయమే పడుతుందని స్పష్టం చేస్తున్నారు. 

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌‌గా మార్చుతూ తీర్మానం ఆమోదించిన తర్వాత గులాబీ పార్టీ నేతల్లోనే అయోమయం నెలకొంది. తమ పార్టీ పేరు ఇప్పుడు టీఆర్ఎస్సా లేక బీఆర్ఎస్సా అర్థం కావడం లేదని పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ ఆవరణలోనే అయోమయం వ్యక్తం చేస్తున్నారు.  కేసీఆర్ పార్టీ పేరు ప్రకటించినప్పుడు చప్పట్లతో ఆమోదం తెలిపిన నేతల్లో బయటకు వచ్చిన తర్వాత ఆ ఉత్సాహం కనిపించలేదు.

మీడియా ప్రతినిధులు పలువురిని పలకరించగా మాట్లాడటానికి ఆసక్తి  చూపించలేదు. కొద్ది మంది మాత్రమే దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ చక్రం తిప్పుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన సందర్భంగా భారీ ఎత్తున వేడుకలు చేయబోతున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ తెలంగాణ భవన్ ఎదుట కొద్ది మందితోనే సంబురాలు చేసుకుని మమ అనిపించారు.

మరోవంక, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌‌గా మారుస్తూ తీర్మానం చేయడంపై దేశంలోని వివిధ పార్టీల నేతలు ఎవ్వరు స్పందించినట్లు కనిపించడం లేదు.  చెప్పుకోదగిన ప్రాంతీయ పార్టీలలో కేవలం జేడీఎస్ అధినేత కుమారస్వామి మాత్రమే శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో ఒక ప్రాంతంకు ఆయన పార్టీ పరిమితం కావడంతో, బెంగుళూరు నగరంతో పాటు, పాత హైదరాబాద్ ప్రాంతం (నిజం ప్రాంతం)లోని తెలుగు వారి ఓట్లు పొందడం కోసం మాత్రమే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. 

 బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కంటూ కేసీఆర్ కలుస్తూ వస్తున్న మమతా బెనర్జీ, శరద్ పవర్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ఎం కె స్టాలిన్ వంటి వారు శుభాకాంక్షలు కూడా తెలిపినట్లు లేదు.   

కేసీఆర్ చార్టర్డ్ ఫ్లైట్ పంపి హైదరాబాద్‌‌కు పిలిపించిన కుమారస్వామి, రాచమర్యాదలతో రప్పించిన తమిళనాడు నేత తిరుమావళన్, కేసీఆర్‌‌‌‌తో కొంత కాలంగా కలిసి పనిచేస్తున్న రైతు సంఘాల నేతలు తప్ప పెద్దగా ఇంకెవరూ ఆయన పార్టీ ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. 

బీఆర్ఎస్‌‌పై తీర్మానం చేసిన కొన్ని నిమిషాల్లోనే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. గతంలో జాతీయ రాజకీయాల్లో తనతో కలిసి రావాలంటూ కేసీఆర్ కలిసిన వివిధ రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీల అధినేతలు బీఆర్ఎస్‌‌పై స్పందించక పోవడం గమనార్హం.