ఎన్ఐఎ దర్యాప్తు చేయనున్న హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసు!

దసరా పండుగ రోజే హైదరాబాద్‌లో విధ్వంసాలు సృష్టించాలనేది భారీ కుట్రను జాహెద్‌, అతని గ్యాంగ్‌ ఇటీవల పట్టుబడడంతో హైదరాబాద్ పోలీసులు భగ్నం చేసినప్పటికీ జాతీయ స్థాయిలో కలకలం సృష్టిస్తున్నది. సరిగా 17 ఏళ్ళ క్రితం 2005లో దసరా పండుగ రోజున బేగంపేట్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు దాడి జరగడం గమనార్హం.  

తాజా కుట్రలో పాకిస్థాన్‌ నుంచి గ్రనేడ్లు అందడం,  అదే పార్సిల్‌లో పాక్‌ సెల్‌ఫోన్లు రావడం, హవాలా మార్గంలో రూ. 39 లక్షల నిధులు సమకూరడంతో రంగంలోకి దిగేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సిద్ధమైంది. గతంలో సహితం పాకిస్థాన్ కేంద్రంగా కుట్ర జరగడంతో ఇదంతా యాదృశ్చికంగా జరిగిన సంఘటన కాదని నిర్ధారణకు వచ్చారు. 

ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన జాహెద్‌, అతని అనుచరులు సమీయుద్దీన్‌, మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని, మరింత సమాచారం రాబట్టేందుకు హైదరాబాద్‌ సీసీఎస్‌ పరిధిలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సిద్ధమవుతుండగా, కేసును తమ స్వాధీనంలోకి తీసుకునేందుకు ఎన్‌ఐఏ అడుగులు వేస్తోంది.

ఇప్పటికే సిట్‌ ప్రాథమిక దర్యాప్తులో ఆ ముగ్గురు నిందితుల నుంచి పేలుళ్ల కుట్రకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టింది. నిందితులను సిట్‌ కస్టడీలోకి తీసుకుని, విచారించే సమయంలో ఎన్‌ఐఏ కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశాలున్నాయి. 

జాహెద్‌ ఎంతమందిని రిక్రూట్‌ చేశాడు? ప్రాథమిక విచారణలో పేర్కొన్న రూ. 39 లక్షల హవాలా నిధులే కాకుండా, ఈ ఐదేళ్లలో ఇంకా ఎంత మొత్తంలో డబ్బులొచ్చాయి? ఎందుకు? వాటిని ఏం చేశారు? అనే సమాచారాన్ని ఎన్‌ఐఏ కూడా సేకరించనున్నట్లు తెలిసింది. పైగా, ఈ కుట్రలో స్థానికంగా ఎవరెవరు భాగస్వాములనే అంశాన్ని తెలుసుకోవడం కోసం ఎన్‌ఐఏ ప్రయత్నించే అవకాశం ఉంది.

2005లో టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు కేసులో సరైన సాక్ష్యాధారాలు లేక విడుదలైన జాహెద్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ఎన్‌ఐఏ భావిస్తోంది. సమీయుద్దీన్‌ కూడా గతంలో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్)లో చేరేందుకు ప్రయత్నించి, పోలీసులకు పట్టుబడ్డాడు. జాహెద్‌, సమీయుద్దీన్‌ తొలిసారి కలుసుకుంది జైలులోనే. 

గతంలో మాదిరిగా కేసులు వీగిపోకుండా ఈ సారి జాహెద్‌కు కఠిన శిక్ష పడేలా సిట్‌ పక్కా ఆధారాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా జాహెద్‌కు పాకిస్థాన్‌ నుంచి అందిన గ్రనేడ్లపై సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో ఓ బృందం నిమగ్నమైంది. 

పాకిస్థాన్‌ నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్‌కు గ్రనేడ్లు చేరుకోగా జాహెద్‌ సూచనలతో సమీయుద్దీన్‌ వాటిని ద్విచక్రవాహనంపై తీసుకువచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దీంతో  మనోహరాబాద్‌-హైదరాబాద్‌ మార్గంలో సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నారు. 

నిందితుల నుంచి పోలీసులు ఐదు సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు. వాటిలో రెండు పాకిస్థాన్‌ నుంచి గ్రనేడ్‌ పార్సిళ్లలో జాహెద్‌కు చేరాయి. ఈ నేపథ్యంలో ఆ ఐదు సెల్‌ఫోన్ల విశ్లేషణకు ఫోరెన్సిక్‌ నిపుణుల సాయం తీసుకుంటున్నారు.