ఢిల్లీ పీఎఫ్‌ఐ కార్యాలయాలు సీజ్‌

దేశంలో అరాచకం సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్‌ఐ సంస్థపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పీఎఫ్‌ఐ సంస్థకు చెందిన మూడు కార్యాలయాలను సీజ్‌ చేశారు. అలాగే, పీఎఫ్‌ఐ నిర్వాహకులపై ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పీఎఫ్‌ఐ సంస్థపై ఐదేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

దేశ రాజధానిలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కి చెందిన ఆస్తులపై ఢిల్లీ పోలీసులు చర్యలు ప్రారంభించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ – ఉపా) కింద కేసు నమోదు చేశారు. షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో పీఎఫ్‌ఐపై యూఏపీఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 

అదేవిధంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాలపై దృష్టిసారించారు. జైద్ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్, అబు ఫజల్ ఎన్‌క్లేవ్ జామియా నగర్‌లోని హిలాల్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్, తెహ్రీ మంజిల్ జామియాలోని పీఎఫ్‌ఐ కార్యాలయాలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ 8 కింద సీజ్ చేశారు.

పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదేండ్ల నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థ పనితీరుపై నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ – ఎన్‌ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ – ఈడీతోపాటు వివిధ రాష్టర పోలీసు బలగాలు విచారణ జరుపుతున్నాయి. 

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 15 రాష్ట్రాల్లో గత నెల 22 న పీఎఫ్‌ఐకి చెందిన 106 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదు రోజుల వ్యవధిలో ఏడు రాష్ట్రాల్లో దాడులు జరిపి పీఎఫ్‌ఐతో సంబంధమున్న 170 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.