తమిళనాడులో ఆర్‌ఎస్ఎస్‌, హిందూ సంస్థల నేతల హత్యకు ఉగ్రకుట్ర

తమిళనాడులోని ఆర్‌ఎస్ఎస్‌, హిందూ సంస్థల నేతల హత్యకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని నలుగురు ఆర్‌ఎస్ఎస్‌ నాయకులు ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‏లో ఉన్నారని పేర్కొంది. ఈ నలుగురు నేతలతోపాటు రాష్ట్రంలోని హిందూ సంస్థల నేతలకు కూడా పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ కార్యాలయాలు, నేతల నివాసాల్లో  ఎన్‌ఐఏ అధికారులు ఎనిమిది రాష్ట్రాలలో ఒకే సమయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాల్లోని సమాచారం మేరకు ఆ సంస్థ గల్ఫ్‌ దేశాల నుంచి సుమారు రూ.120 కోట్ల మేరకు నిధులు సేకరించినట్లు రుజువైంది. దీంతో ఆ సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీ, హిందు మున్నని నేతల నివాసాలపై వరుసగా పెట్రోలు బాంబులతో దాడులు జరిగాయి. ఈ పరిస్థితులలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆర్‌ఎస్ఎస్‌, హిందూ సంస్థల నేతలను హత్యచేసేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్రపన్నుతున్నాయంటూ కేంద్ర ఇంటెలిజెన్‌ విభాగం అధికారులు హెచ్చరించి, వారికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఆర్‌ఎస్ఎస్‌ రెండు జోన్లలో పనిచేస్తోంది. ఈ రెండు జోన్లలో నలుగురు నాయకత్వం వహిస్తున్నారు. వీరికి పటిష్టమైన భద్రత కల్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆ నలుగురితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న ప్రథమ శ్రేణి నాయకులకు కూడా భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ నాయకులు ఇకపై తమ రోజువారీ కార్యక్రమాలు, పర్యటన వివరాలను ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్లకు తెలియజేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాష్ట్రమంతటా ఆర్‌ఎస్ఎస్‌ నాయకులు నివసిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్ సీనియర్‌ నాయకులకు అవసరమైతే గన్‌మెన్‌లను కూడా ఏర్పాటు చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. ఆర్‌ఎస్ఎస్‌ నేతలు కోరుకుంటే కమెండోలతో భద్రత కల్పించవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం హెచ్చరికలతో రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్ నేతలు, హిందూ సంస్థల నేతలకు ఒకట్రెండు రోజుల్లోగా పోలీసు భద్రత కల్పించనున్నట్లు రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.