ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ చేజిక్కించుకున్న భారత్

ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ చేజిక్కించుకున్న రోహిత్‌ సేన  దక్షిణాఫ్రికాపై కూడా సిరీస్ కైవసం చేసుకోండి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్‌ 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసి మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ పట్టేసింది. స్వదేశంలో దక్షిణ ఆఫ్రికాపై భారత్ సిరీస్ కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. విరాట్‌ కోహ్లీ (28 బంతుల్లో 49 నాటౌట్‌; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), రోహిత్‌ శర్మ (43; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. 

ఆఖర్లో దినేశ్‌ కార్తీక్‌ (7 బంతుల్లో 17 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. గతంలో ఇక్కడ జరుగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా తాజా పోరులో గువాహటి అభిమానులు బౌండ్రీల జడివానలో తడిసి ముద్దయ్యారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో సఫారీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డ దక్షిణాఫ్రికా చివర్లో ఎంత ప్రయత్నించినా విజయానికి చేరువ కాలేకపోయింది. 

డేవిడ్‌ మిల్లర్‌ (47 బంతుల్లో 106 నాటౌట్‌; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగినా ఫలితం లేకపోయింది. డికాక్‌ (48 బంతుల్లో 69 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అర్శ్‌దీప్‌ సింగ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి మూడు ఓవర్లలో కలిపి 36 పరుగులిచ్చిన అర్శ్‌దీప్‌ 19వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. 

రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇండోర్‌లో నామమాత్రమైన మూడో టీ20 జరుగనుంది. టీ20ల్లో వేగంగా వెయ్యిపరుగుల మైలురాయికి చేరుకున్న క్రికెటర్‌గా సూర్య అగ్రస్థానంలో నిలిచాడు. 573బంతుల్లో 174 స్టైక్‌రేటుతో పరుగులు పూర్తి చేశాడు. 

కోహ్లీ అండతో రెచ్చిపోయిన సూర్య హాఫ్‌సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవంక, 237 పరుగలు భారీ స్కోరుతో భారత్ దక్షిణాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది.