ఫోన్ రింగ్ అయితే `హలొ’ కాదు, `వందేమాతరం’ అనండి!

మన ఫోన్ రింగ్ అయితే వెంటనే `హలొ’ అంటూ మాట్లాడటం ప్రారంభిస్తాము. అయితే, అది భారతీయ సంప్రదాయం కాదని, `వందేమాతరం’ అంటూ మాట్లాడటం ప్రారంభించాలని ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. అంతేకాదు, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి తమ సిబ్బంది ఫోన్  కాల్స్‌ను  కానీ, ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ని కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు ”హలో”కు బదులు ”వందేమాతరం”అని అనాలి. ‘ఆజాదీ కి అమత్ మహోత్సవ్‌’ జరుపుకొంటున్న తరుణంలోనే మహాత్మాగాంధీ జయంతి కూడా ఆదివారం రావడంతో ఇందుకు సంబంధించిన ప్రచారానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. 
 
ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే సారథ్యంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఈ తాజా ఉత్తరువును జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, సెమీ గవర్నమెంట్, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ సిబ్బంది మాట్లాడేటప్పుడు, బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు కూడా ‘హలో’కు బదులు ‘వందేమాతరం’ అంటూనే సంబంధించాలని ప్రభుత్వ ఉత్తర్వు)లో పేర్కొన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన ప్రచారాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్  ముంగంటివార్ లాంఛనంగా వార్దాలో ప్రారంభించారు.
‘హలో’ స్థానే ‘వందేమాతరం’ అనాలనే తీర్మానాన్ని ఆదేశంగా భావించాలా? విజ్ఞప్తిగా భావించాలా? అని మంత్రి ముంగటివార్‌ను మీడియా ప్రశ్నించగా, గాంధీ జయంతి సందర్భంగా తాము చేపట్టిన ప్రచారమని సమాధానమిచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ”వందేమాతరం” నినాదం  కీలక పాత్ర వహించిందని, భగత్ సింగ్ చివరి మాట కూడా వందేమాతరమేనని ఆయన గుర్తు చేశారు.
అందుకనే ఇక  నుంచి వందేమాతరాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసేందుకే వందేమాతరం ఉద్యమాన్ని ప్రారంభించామని హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న  ముంగంటివార్ సమాధానం  ఇచ్చారు.