కల్వకుంట్ల కుటుంబం పగటికలలు కంటోంది

కేసీఆర్ కొత్త పార్టీ పెట్టినట్లు, అప్పుడే ప్రధాని అయినట్లు, టీఆర్ సీఎం అయినట్లు కల్వకుంట్ల కుటుంబం పగటికలలు కంటోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి యెద్దేవా చేశారు. బీజేపీని ఓడిస్తానని ఉత్తర కుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో టిఆర్ఎస్‌కు ఉన్న 8 సీట్లతో సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారంటూ విమర్శలు గుప్పించారు

వ్యతిరేక భావనతో వచ్చే ఏ పార్టీకీ మనుగడ ఉండదంటూ, దేశంలో కేసీఆర్‌తో ఏ పార్టీ కలిసి రావడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తో ఏకీభవించలేదని అయన్ని కలిసిన నాయకులు చెబుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్  ఏ లక్ష్యంతో కొత్త పార్టీ పెడుతున్నారో టీఆర్ఎస్ నేతలే అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.

ఎంఐఎంను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ అని కిషన్ రెడ్డి  ఆరోపించారు. ప్రగతిభవన్‌కు అసదుద్దీన్‌ ఓవైసీ బుల్లెట్ బండిపై నేరుగా వెళ్తారని విమర్శించారు. టీఆర్ఎస్‌ కు మిగిలిన ఏకైక మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే అని స్పష్టం చేశారు.  సీఎం కెసిఆర్ ఫాంహౌస్‌లో కలలు కంటున్నారంటూ చెబుతూ  కల్వకుంట్ల కుటుంబసభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ కనిపిస్తున్నాయంటూ కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ వైఫల్యాల మీద చర్చ జరగొద్దనేదే కెసిఆర్‌ ఆలోచన అని తెలిపారు.

మునుగోడు ఉపఎన్నికకు బిజెపి సిద్ధం 

మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధంగా ఉందని చెబుతూ మునుగోడు అభివృద్ధి కోసమే ఈ ఉప ఎన్నికలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ఈ కొద్ది రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. తెలంగాణలో టిఆర్ఎస్ పాలన పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. 

ఎవరూ నిలిచినా మునుగోడులో విజయం బిజెపిదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామని భరోసా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో టిఆర్ఎస్‌కు భవిష్యత్‌ ఉండదని, కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి పోతోందని స్పష్టం చేశారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-టిఆర్ఎస్ కలిసి కుట్ర చేసే అవకాశం ఉందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. కమ్యూనిస్ట్ సానుభూతి పరులంతా కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకతతో ఉన్నారని చెబుతూ వాళ్ల మనస్సంతా మోదీపైనే ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కల్వకుంట్ల కుటుంబ పాలనకు రిఫరెండమ్ అని తెలిపారు.

సంజయ్ 5 వ విడుత పాదయాత్ర వాయిదా 

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టదలచిన 5 వ విడుత పాదయాత్ర వాయిదా పడింది. ఇప్పటికే నాల్గు విడతలుగా యాత్ర చేపట్టిన సంజయ్తా జాగా ఐదో విడత పాదయాత్రకు సిద్ధం అయ్యారు. 

అక్టోబర్ 15వ తేదీ నుండి పాదయాత్రను కొనసాగించాలని అనుకున్నారు. దీనికి సంబదించిన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే తాజాగా సోమవారం మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో  సంజయ్ 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. ఉప ఎన్నిక అయ్యాక ఈ యాత్ర కొనసాగే అవకాశం ఉంది.