నవంబర్‌ 3న మునుగోడు ఉప ఎన్నిక

నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది.

15న నామినేషన్లను పరిశీలించనుండగా, 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. నవంబర్‌ 3న ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా 6న ఓట్లను లెక్కించనున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 

ఇదిలా ఉండగా తెలంగాణతో పాటుగా  దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ (మునుగోడు)తో పాటు  మరో   ఐదు రాష్ట్రాల్లోని (మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సా) పలు స్థానాల్లో ఉప ఎన్నికల  నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం  విడుదల చేసింది.   

రాజగోపాల్ రెడ్డి ఎమ్యెల్యే పదవితో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి సిద్దపడుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే పాల్వయి స్రవంతి ని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇంకా అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. 

వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసి ఉండడంతో ఈ ఉపఎన్నికను రిహార్సల్ గా ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కొంతమేరకు బలం కలిగిన్నట్లు భావిస్తున్న వామపక్షాలు ఇప్పటికే టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. దానితో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల సన్నాహాలలో గత నెలరోజులుగా మునిగిపోయి ఉన్నాయి.