తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ రూ. 3,800 కోట్ల జరిమానా

తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్-ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు, కోర్టు తీర్పులను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ. 3,800 కోట్ల జరిమానా విధించింది. 

రోజుకు 1824 మిలియన్‌ లీటర్ల మురుగునీటి శుద్ధి వ్యత్యాసానికి గాను రూ.3648 కోట్లు, ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించనందుకు రూ.177 కోట్లు కలిపి మొత్తం రూ.3825 కోట్ల పరిహారాన్ని విధిస్తున్నట్లు తెలిపింది. రెండు నెలల్లో ఈ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ పునరుద్ధరణ కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని స్పష్టం చేసింది.

వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టి.. పురోగతి చెప్పాలని ఆదేశించింది. పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ పిటిషన్ పై విచారించిన ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 1996లో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు 2014లో ఎన్జీటీకి బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్య నివారణపై మరో పిటిషన్ దాఖలైంది. 

100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలపై చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక, మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పిటిషన్  వేసింది. అన్ని రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై 1996 నుంచి విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2014లో ఎన్జీటీకి కేసును బదిలీ చేసింది. 

8 ఏళ్లుగా విచారణ జరుపుతున్న ఎన్జీటీ.. పలుసార్లు తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) స్వయంగా రెండు సార్లు విచారణకు హాజరయ్యారు. అయినా తాము జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఎన్జీటీ గుర్తించింది. 

దీంతో ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, న్యాయ సభ్యుడు జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ త్యాగి, సభ్య నిపుణులు సెంథిల్‌ వేల్‌, అఫ్రోజ్‌ అహ్మద్‌తో కూడిన నలుగురు సభ్యుల ధర్మాసనం జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని హెచ్చరించింది. 

‘‘కనీసం మూడు ప్రధాన పట్టణాలు, మూడు టౌన్లను, ప్రతి జిల్లాలో మూడు గ్రామాలను గుర్తించి ఆరు నెలల్లో పర్యావరణ నిబంధనలను పాటించాలని 2019 ఏప్రిల్‌లో ఆదేశించాం. నేరుగా సీఎస్‌ కింద పర్యావరణ విభాగాలను ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశాం” అని గుర్తు చేసింది. 

“అయితే, మా ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్నట్లు లేదు. మూడేళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో వాటిని పాటించలేదు. సమీప భవిష్యత్తులో వాటిని పాటిస్తారని కూడా అనుకోవడం లేదు. అందుకు బాధ్యులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు. పురోగతి ఆడిట్‌ను కూడా నిర్వహించినట్లు లేదు” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

“చట్టాలతో పాటు సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎవరూ బాధ్యులు కానట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రూల్‌ ఆఫ్‌ లా ఎలా సాధ్యమవుతుందో చెప్పడం కష్టతరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ఆదేశాలను పాటిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ట్రైబ్యునల్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

2020 ఫిబ్రవరిలో సీఎస్‌ తమ ముందు హాజరైన తర్వాత కూడా వ్యర్థాల నిర్వహణలో పురోగతి ఏమీ లేదని, ఘన, ద్రవ వ్యర్థాల ఉత్పత్తి, శుద్ధిలో చాలా వ్యత్యాసం ఉందని స్పష్టం చేసింది. ఆదేశాల అమలు బాధ్యత సిఎస్ పై ఉంటుందని, తక్షణమే ప్రత్యేక సీనియర్‌ స్థాయి నోడల్‌ కార్యదర్శి నేతృత్వంలో సాంకేతిక నిపుణులతో కూడిన బృందాన్ని నియమించాలని సూచించింది. దీని పురోగతిపై ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని సీఎ్‌సకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.