దుర్గాదేవిని పూజించిన ముస్లిం నాయకురాలికి బెదిరింపులు

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ ముస్లిం బీజేపీ నాయకురాలు తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. యూపీలోని అలీఘడ్ నగర నివాసి అయిన బీజేపీకి నాయకురాలు రూబీ అసిఫ్ ఖాన్ తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు.

అంతే ఇస్లాం మతానికి విరుద్ధంగా దేవి విగ్రహానికి పూజలు చేసిన రూబీ అసిఫ్ ఖాన్ కాఫిర్ అంటూ ఆమెను,ఆమె కుటుంబాన్ని హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ మేర బెదిరింపులతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. హిందూ సంప్రదాయాల కనుగుణంగా పూజలు చేసిన కాఫీర్ అంటూ ఆమె,ఆమె కుటుంబాన్ని సజీవంగా దహనం చేస్తామని పోస్టర్లలో బెదిరించారు.

రూబీ గత నెలలో వినాయకచవితికి కూడా గణేశ్ విగ్రహాన్ని తన ఇంట్లో ప్రతిష్ఠించి, తర్వాత  నరోరా ఘాట్ వద్ద భారీ భద్రత నడుమ నిమజ్జనం చేశారు. రెండేళ్ల క్రితం కూడా రూబీ ఖాన్ తన ఇంట్లో రాం దర్బార్  నిర్వహించారు. గతంలో రూబీకి ఫత్యా  జారీ చేశారు. ఈ బెదిరింపులపై రూబీ అసిఫ్ ఖాన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు. 

తన కుటుంబం హిందూ ముస్లిం ఐక్యత కోసం పాటుపడుతుందని, కాని తమను బెదిరిస్తున్నారని రూబీ భర్త ఆసిఫ్ ఖాన్ చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏ దేవుడిని అయినా పూజించవచ్చని మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు వ్యాఖ్యానించారు. ఆమె కొంతకాలంగా హిందూ దేవతలకు పూజలు చేస్తున్నారు.

 హిందూ సనాతన ధర్మం ప్రకారం దుర్గాదేవికి పూజలు చేసిన రూబీకి హిందూ మహాసభ మద్ధతు ఇచ్చింది. దుర్గాదేవిని పూజించిన రూబీని హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మహామండలేశ్వర్ అన్నపూర్ణ భారతి అభినందించారు. రూబీకి దుర్గాదేవి రక్షణ కల్పిస్తుందని అన్నపూర్ణ భారతి పేర్కొన్నారు