సీడీఎస్‌ గా అనిల్‌ చౌహాన్‌ నియామకం

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) గా లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) అనిల్‌ చౌహాన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో నియమితులైన అనిల్‌ చౌహాన్‌.. కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీ విభాగం సలహాదారుగా కూడా సేవలందిస్తారు.

దాదాపు 40 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో ఇండియన్‌ ఆర్మీలో పనిచేసిన అనిల్‌ చౌహాన్‌.. బిపిన్‌ రావత్‌ దుర్మరణంతో సీడీఎస్‌గా ప్రభుత్వం నియమించింది. సైన్యంలో అతని విశిష్టమైన సేవలకు గుర్తింపుగా ”పరమ్ విశిష్ట సేవా మెడల్”, ”ఉత్తమ్ యుధ్ సేవా మెడల్”, ”అతి విశిష్ట సేవా మెడల్” లను అందుకున్నారు.

జమ్ము కశ్మీర్‌తో పాటు ఆగ్నేయ భారతదేశంలో కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీలో ఆపరేషన్స్‌ చేపట్టడంలో అనిల్ చౌహాన్‌ నేర్పరిగా పేరు గడించారు. op sunrise కార్యక్రమానికి రూపకల్పన చేసిన అనిల్‌ చౌహాన్‌ భారత-మయన్మార్‌ సరిహద్దు సమీపంలో తిరుగుబాటు గ్రూపులకు వ్యతిరేకంగా ఇరుదేశాల సైన్యం సమన్వయ కార్యకలాపాలు కొనసాగించేలా చేయగలిగారు.

బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ ప్రణాళికలో కూడా ఆయన పాల్గొన్నారు. అనిల్‌ చౌహాన్‌ 1967 మే 18 న జన్మించారు. 1981లో ఇండియన్ ఆర్మీకి చెందిన 11 గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు. ఖడక్వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్‌ ఇండియన్ మిలిటరీ అకాడమీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు.

అతను మేజర్ జనరల్ హోదాలో ఉత్తర కమాండ్‌లోని బారాముల సెక్టార్‌లోని పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. సెప్టెంబరు 2019 నుంచి తూర్పు కమాండ్‌కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 మే 31 న పదవీ విరమణ చేసే వరకు ఇదే బాధ్యతలో కొనసాగారు.

ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన జాతీయ భధ్రత, వ్యూహాత్మక అంశాల్లో సేవలు అందించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌తో సహా ముఖ్యమైన సిబ్బంది నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరించారు. అంగోలాకు ఐక్యరాజ్యసమితి మిషన్‌గా కూడా పనిచేశారు.