సోనియా మందలింపుతో పార్టీ అధ్యక్ష ఎన్నికకు గ‌హ్లాట్ దూరం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం కాకుండా మరెవ్వరు ఎన్నికైనా వారు కీలు బొమ్మగానే వ్యవహరించ వలసిందే అని, పార్టీ వ్యవహారాలలలో గాంధీ కుటుంభం మాటే చెల్లుబాటు  అని మరోసారి స్పష్టమైంది. పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలలో స్వయంగా తాము ఎంపిక చేసిన అశోక్ గ‌హ్లాట్ అందుకు ప్రతిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని ఖాళీ చేసి, తాము చెప్పిన సచిన్ పైలట్ కు ఇవ్వడానికి అడ్డు చెప్పడంతో వారు ఆగ్రవేశాలకు గురయ్యారు.

బుధవారం సాయంత్రం నుండి ఢిల్లీలో సోనియా ను కలవడం కోసం ఎదురు చూపులు చూసి, చివరకు గురువారం మధ్యాహ్నం కలవగలిగిన గెహ్లాట్ రాజస్థాన్ ఎమ్యెల్యేలు ప్రదర్శించిన ధిక్కార ధోరణి పట్ల ఆమెకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఆమె చెప్పిన్నట్లే నడుచుకుంటానని అంటూ వినయం ప్రదర్శించారు.

ఆమెను కలసిన తర్వాత ప్రస్తుత వాతావరణంలో పార్టీ అధ్యక్ష పదవికి పోటీ  చేయడం లేదని ప్రకటించారు. రాజస్థాన్ సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ..అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ సమక్షంలోనే సుమారు గంటసేపు గెహ్లాట్ తో సమావేశమైన సోనియా ఇటీవల రాజస్థాన్‌లో గెహ్లాట్‌ వర్గీయులు ధిక్కార ధోరణి ప్రదర్శించడం,  తాను ఏమీ చేయలేనంటూ గెహ్లాట్ చేతులెత్తేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ రాజస్థాన్ అసమ్మతి.. పార్టీకి చెడ్డపేరు తెచ్చిందని సోనియా కన్నెర్ర చేశారు.

రాజస్థాన్‌ అసమ్మతిని కట్టడి చేయలేని నాయకుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎలా నడపగలరని సోనియా ప్రశ్నించినట్లు తెలిసింది. గెహ్లాట్ తన నమ్మకాన్ని వమ్ము చేశారని కూడా సోనియా అన్నట్లు చెబుతున్నారు.  కాగా, తాను సీఎంగా ఉండాలా వద్దా అనేది కూడా సోనియా నిర్ణయిస్తారని గెహ్లాట్ మీడియాకు చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడైన కార్యకర్తనని చెప్పుకొచ్చారు.

అధ్యక్ష పదవికి దిగ్విజయ్ సింగ్

మ‌రోవైపు కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి `గాంధీ కుటుంభం’ అభ్యర్థిగా  సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ ఇప్పుడు రంగంలోకి వచ్చారు. తాను రేపు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నట్లు ప్రకటించారు. అసలు ఇప్పుడు జరుగుతున్నది అధ్యక్షపదవికి ఎన్నికా? లేదా `గాంధీ కుటుంబం’ ఎంపికా? అనే అనుమానాలు ఈ సందర్భంగా వెల్లడి అవుతున్నాయి.

ఇప్పటికే ఆ పదవికి పోటీ చేయడం కోసం 30న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ప్రకటించినపార్టీ ఎంపీ శ‌శి థ‌రూర్ దిగ్విజయ్ అభ్యర్థిత్వాన్ని  స్వాగ‌తించారు. దిగ్విజ‌య్ సింగ్ గురువారం త‌న‌తో క‌లిసి మాట్లాడార‌ని, తాము ప్ర‌త్య‌ర్ధులుగా ఈ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ‌టం లేద‌ని, స‌హ‌చ‌రులుగా ఇద్ద‌రి మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క పోటీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఎవ‌రు బ‌రిలో నిలిచినా కాంగ్రెస్ గెలుస్తుంద‌ని తాము భావిస్తామ‌ని శ‌శి థ‌రూర్ ట్వీట్ చేశారు. మ‌రోవైపు గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వి చేప‌డితే రాజ‌స్ధాన్ సీఎం ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని ఆశించిన స‌చిన్ పైల‌ట్ భంగ‌ప‌డ్డారు. రాజ‌స్ధాన్‌లో తాజా ప‌రిణామాల నేప‌ధ్యంలో సచిన్ పైల‌ట్ గురువారం  సోనియా గాంధీతో స‌మావేశమ‌య్యారు.