నెల్లూరులో దువ్వూరు రామిరెడ్డి పోస్టల్ కవర్ ఆవిష్కరణ 

జిల్లావాసులుగా స్వాతంత్ర్య సమరయోధురాలు, గొప్ప సంఘ సంస్కర్త శ్రీమతి పొణకా కనకమ్మ, ‘కవి కోకిల’ మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకుని ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన దువ్వూరి రామిరెడ్డి గార్ల జీవితాలు భావితరాలకు ఆదర్శం కావాలని నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ చెప్పారు. 
 
గురువారం శ్రీమతి పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి, కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితిల అధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్ లో కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి పోస్టల్ కవర్ , పుస్తకావిష్కరణ కార్యక్రమంలో  అరుణమ్మతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. 
 
పొణకా కనకమ్మ, దువ్వూరి రామిరెడ్డి గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంధర్బంగా పినాకిని రత్నదీపం, హిందూ-పద- పాదషాహీ పుస్తక ఆవిష్కరణ, కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి పేరుతో రూపొందించిన పోస్టల్ కవర్ ను వారు  ఆవిష్కరించారు. 
 
ఈ సంధర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ  ఆడపిల్లలకు విద్యను అందించాలన్న సంకల్పంతో కస్తూరి దేవి హై స్కూల్ ను ఏర్పాటు చేయడంతో పాటు పల్లెపాడులో గాంధీ ఆశ్రమం ఏర్పాటుకు పొణకా కనకమ్మ ఎంతో కృషి చేశారని కొనియాడారు. 
 
దువ్వూరి రామిరెడ్డి తన రచనల ద్వారా ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందారని, బహుభాషా కోవిదునిగా సంప్రదాయ రీతులను మిళితం చేసి కొత్తతరానికి సాహితీ బాటలు వేసిన దువ్వూరి, ఆధునికాంధ్ర కవుల్లో ముందు వరుసలో వుంటారని ఆమె తెలిపారు. బహుముఖ కోణాల్లో ప్రతిభను చాటుకోవడం వల్ల దువ్వూరి పేరు సాహితీ పుటల్లో శాశ్వతస్థానం సంపాదించుకుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చుని ఆమెపేర్కొ న్నారు. వీరి జీవితాలు భావితరాలకు ఆదర్శం కావాలని ఆమె చెప్పారు. 
 
జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, సాంస్కృతిక పరంగా, సాహిత్యం పరంగా నెల్లూరు జిల్లాకు ఎంతో ఘనమైన చరిత్ర వుందని, ఎంతోమంది నెల్లూరీయులు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించారని, వారిలో  పొణకా కనకమ్మ, దువ్వూరి రామిరెడ్డి వున్నారని తెలిపారు. 
 
 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు సంబంధించిన కవులు కళాకారులు, స్వాతంత్ర పోరాట యోధులను స్మరించుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను సన్మానించుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. పొణకా కనకమ్మ గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలని ఆయన కొనియాడారు. 
 
 తమ రచనల ద్వారా ఎన్నో తెలియని విషయాలను భావితరాలకు తెలియచేసేలా దువ్వూరి రామిరెడ్డి  ఎంతో కృషి చేశారని చెబుతూ వారి పేరుతో ఈ రోజు పోస్టల్ కవర్ ను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.  
 
నెల్లూరు డివిజన్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఎస్. రామకృష్ణ, దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి కార్యదర్శి బి. సురేంద్రనాథ్ రెడ్డి,   కోశాధికారి చెలంచెర్ల భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొండా లక్ష్మీకాంత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, శ్రీమతి పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి కోశాధికారి గూడూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 
.