ఆస్ట్రేలియాలో అవినీతి నిరోధక కమిషన్‌ను ఏర్పాటు

బహుశా ప్రపంచంలోనే మొదటిసారిగా, ప్రజా ప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేసే అధికారాలతో అవినీతి నిరోధక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్ట్రేలియాలో దాదాపు 15 సంవత్సరాలపాటు అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు, వివిధ వర్గాలవారు పోరాడిన తర్వాత ఫెడరల్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
 
 నేషనల్ యాంటీ కరప్షన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని సృష్టించడానికి ఈ బిల్లు దోహదపడుతుందని చెప్తోంది.  అవినీతిని నిరోధించేందుకు ఫెడరల్ ఇంటెగ్రిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన బిల్లును బుధవారం పార్లమెంటులో లేబర్ గవర్నమెంట్  ప్రతిపాదించింది.
అటార్నీ జనరల్ మార్క్ డ్రేఫస్  బిల్లును ప్రవేశపెడుతూ ఇది రాజకీయాలపై నమ్మకాన్ని మెరుగుపరచడంలో లేబర్ పార్టీ  నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. “మంత్రులు, చట్టబద్ధమైన కార్యాలయ హోల్డర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లను అంచనా వేయడానికి అతనికి అధికారం ఉంటుంది” అని ఆయన చెప్పారు. “అతను తన స్వంత చొరవతో లేదా ప్రజలు,  విజిల్‌బ్లోయర్‌లతో సహా ఎవరి నుండి వచ్చిన రిఫరల్‌లకు ప్రతిస్పందనగా దర్యాప్తును ప్రారంభించే విచక్షణను కలిగి ఉంటాడు” అని తెలిపారు. 
 
కమిషన్‌కు పబ్లిక్ హియరింగ్‌లను నిర్వహించే అధికారం ఉంటుందని, అయితే “విచారణలు మూసిన తలుపుల వెనుక నిర్వహిస్తారు” అని పేర్కొన్నారు. ఈ కమిషన్ సర్వ స్వతంత్రంగా పని చేస్తుందని ఈ బిల్లు చెప్తోంది. తీవ్రమైన, లేదా, వ్యవస్థాగత అవినీతి ఆరోపణలపై స్వతంత్రంగా దర్యాప్తు చేసేందుకు కావలసిన అన్ని వనరులను పుష్కలంగా సమకూర్చుతామని తెలిపింది. ఎంపీల వంటి ప్రజా ప్రతినిధులపై వచ్చే ఆరోపణలపై మాత్రమే కాకుండా ప్రాపర్టీ డెవలపర్స్, లాబీయిస్టులు, యూనియన్ల వంటి మూడో పక్షాలపై వచ్చే ఆరోపణలపై కూడా దర్యాప్తు జరిపేందుకు ఈ కమిషన్‌కు అధికారం ఉంటుందని తెలిపింది.
అనామక వ్యక్తులు ఇచ్చే సమాచారంపై కూడా విచారణ జరిపే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాలో ప్రధాన మంత్రి, మంత్రులపై అవినీతి ఆరోపణలు విపరీతమయ్యాయి. అనుచిత ప్రవర్తన, క్రీడలు, కార్ పార్కింగ్ లాట్స్ కేటాయింపు, స్నేహితురాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం వంటి అవినీతి కార్యకలాపాలకు మంత్రులు, ఎంపీలు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 
కరోనా మహమ్మారి సమయంలో ప్రధాన మంత్రి ఏకంగా ఆరు మంత్రిత్వ శాఖలను గుట్టుగా తనకు తానే ఇచ్చుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విధంగా రహస్య కార్యకలాపాలు పెచ్చుమీరిపోతున్నాయని, ప్రజలకు రాజకీయాలపట్ల నమ్మకం సన్నగిల్లుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 
అయితే మరింత పారదర్శకత అవసరమని ఉద్యమకారులు చెప్తున్నారు. అసాధారణ విచారణలను మాత్రమే బహిరంగంగా జరిపేందుకు ఈ బిల్లులో అవకాశం ఉందని, రహస్య విచారణ విధానం ఉండటం శ్రేయస్కరం కాదని చెప్తున్నారు. కమిషన్ పట్ల ప్రజలకు నమ్మకం కుదరాలంటే కచ్చితంగా విచారణలు బహిరంగంగానే జరగాలని స్పష్టం చేస్తున్నారు.
దీనివల్ల అవినీతి పట్ల ప్రజలకు అవగాహన పెరుగుతుందని, తద్వారా అవినీతిని నిరోధించడం సాధ్యమవుతుందని చెప్తున్నారు. బహిరంగ విచారణలు ప్రజాహితం కోసమేనని, 30 ఏళ్ళలో ఆస్ట్రేలియా సాధించిన అనుభవాన్ని రంగరించి పార్లమెంటరీ కమిటీ ఓ ఉత్తమ విధానాన్ని సూచిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్తున్నారు.