పలు దేశాల్లోఅక్రమ పోలీస్ స్టేషన్లు ప్రారంభించిన డ్రాగన్‌

ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని సూపర్‌ పవర్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న డ్రాగన్‌ కంట్రీ చైనా ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్లతో పలు దేశాల్లో ఏర్పాటు చేసిందనే విస్తుపోయే వాస్తవాలను ఇన్వెస్టిగేటివ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం రిపోర్టికా వెల్లడించింది.
 
సొంత దేశాల్లోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా, చైనా ఈ అక్రమ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు చేయడంపై మానవ హక్కుల ప్రచారకుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ విధంగా 54 అక్రమ పోలీస్ స్టేషన్లను పలు దేశాలలో ప్రారంభించినట్లు మీడియా కధనాలు వెల్లడిస్తున్నాయి.
 
ఐరోపాలోని 36 ఉండగా, లండన్ లో గల ఒక పోలీస్ స్టేషన్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో పనిచేస్తున్నది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లతో సహా 16 ఐరోపా దేశాలలో ఇటువంటి పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
 
 ఆయా దేశాలలోని చైనా జాతీయులకు వివిధ అనుమతులు పొందేందుకు, వారు తమ నైపుణ్యం పెంపొందింప చేసుకునేందుకు సహకరించడం కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చైనా అధికారులు పేర్కొంటున్నా  చైనా ప్రభుత్వం పట్ల అసమ్మతితో వ్యవహరించే తమ దేశస్థులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి తిరిగి తీసుకు వెళ్లి, అక్కడ శిక్షలు పడేవిధంగా చేయడం కోసమే ఇవి పనిచేస్తున్నట్లు పలు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
 
పాశ్చాత్య దేశాలు మానవ హక్కులు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ప్రభుత్వం పట్ల అసమ్మతితో ఉన్నవారిని సాధారణ దౌత్య ప్రక్రియలు వెనుకకు తీసుకు వెళ్లడం కష్టం అవుతుంది. అందుకనే ఇటువంటి దొంగ దారులు అనుసరిస్తున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.

కెనడాలో పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో (పీఎస్‌బీ) పేరిట చైనా అనధికారిక పోలీస్‌ స్టేషన్లను నిర్వహిస్తున్నట్లు ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం రిపోర్టికా వెల్లడించింది. స్థానిక మీడియా ఫ్యుజ్హుయో ప్రకారం పోలీస్‌ సర్వీస్‌ స్టేషన్లను పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరోగా కెనడా వ్యాప్తంగా చైనా విస్తరించింది.

గ్రేటర్‌ టోరోంటో ఏరియాలోనే కనీసం మూడు పీఎస్‌బీ స్టేషన్లు ఉన్నాయి. చాలా దేశాల్లోని ఎన్నికలను సైతం. అక్రమ పోలీస్‌ స్టేషన్ల ద్వారా చైనా ప్రభావితం చేస్తోందని రిపోర్టికా వెల్లడించింది.

ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, యుకె వంటి దేశాల్లో చైనా ఈ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన, చైనాలో పరిస్థితులపై గళం ఎత్తిన దేశాల్లో అత్యధిక పోలీస్‌ స్టేషన్లను చైనా ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండించింది. అవి కేవలం అక్కడున్న చైనా జాతీయులకు ఒకేషనల్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్లు మాత్రమే అని పేర్కొంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికేనని చైనా అధికారులు ప్రకటించారు.

అయినప్పటికీ, ఈ సేవా స్టేషన్లు తరచుగా  తమ అధికార పరిధిని దాటి వెళుతున్నాయని పలువురు మీడియా, ప్రభుత్వ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నారు.  వాస్తవానికి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరస్థులు న్యాయస్థానాలను ఎదుర్కొనేందుకు చైనాకు తిరిగి రావడానికి బ్లాక్ మెయిల్ చేయడంలో ఇవి సర్వీస్ స్టేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఏప్రిల్ 2021 నుండి జూలై 2022 వరకు 230,000 మందికి పైగా ఈ పద్ధతిలో చైనాకు తిరిగి తీసుకువచ్చినట్లు అధికారిక పత్రాలు చూపిస్తున్నాయని యూరోపియన్ ఎన్జిఓ, సేఫ్‌గార్డ్ డిఫెండర్స్ తెలిపింది. చాలా సార్లు, “ఆరోపణలు” ఎదుర్కొంటున్న వ్యక్తులు తాము  చేయని నేరాలకు బలవంతంగా లొంగిపోవలసి వస్తున్నది.

ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు తమకు సహకరించని పక్షంలో  వారి సన్నిహిత బంధువులను తరచుగా ఈ ప్రక్రియలోకి లాగుతున్నారు.   నిందితులు దారికిరాని పక్షంలో వారిని వేధిస్తున్నట్లు వెల్లడవుతున్నది.  నిందితులు తమ ఆదేశాలను పాటించేలా చేసేందుకు వారి పిల్లలకు పాఠశాలకు వెళ్లే హక్కును నిరాకరించడం లేదా వారి ఇళ్లను కూల్చివేయడం లేదా ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం  వారి వంటి పద్ధతులు సర్వసాధారణమై పోతున్నాయి.