లండన్ లో గార్డియన్ పత్రిక ఎదుట హిందువుల నిరసన

ఒక పక్క సెప్టెంబరులో చల్లటి గాలులు వీస్తుండగా, బుధవారం  ఉదయం లండన్ లోని గార్డియన్ వార్తాపత్రిక కార్యాలయాల వెలుపల బ్రిటిష్ హిందూ కమ్యూనిటీకి చెందిన 50 మంది సభ్యులు నిరసనకు పూనుకున్నారు. ఆ వార్తాపత్రికలో నిరంతర హిందూ వ్యతిరేక, భారతదేశ వ్యతిరేక కథనాలపై హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ప్రతి వార్తా కథనంలో  హిందూ జాతీయవాదులు, ఇతర వర్గాలను దెయ్యాలుగా చూపే భావోద్రేక పదాలతో ముడిపెట్టి హిందూ సమాజాన్ని దెయ్యంగా మార్చుతున్నారని అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కథలన్నీ పక్షపాతంతో కూడినవని, పూర్తిగా కల్పితాలంటూ స్పష్టం చేశారు.
 
విభిన్న అభిప్రాయాలను అందించే లేఖలను ఆ పత్రికలో ప్రచురించడం లేదని, దానితో  గార్డియన్ కథనాలను సవాలు చేయడానికి మరో మార్గం లేక నిరసనకు పూనుకున్నట్లు తెలిపారు. బుధవారం లండన్‌లోని గార్డియన్ ప్రధాన కార్యాలయం వెలుపల జాగరణ చేయడం ద్వారా వారు తమ నిరసనను వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంగా ఆ వార్తాపత్రికకు అందించిన ఓ వినతి పత్రంలో  వేధింపులకు గురవుతున్న పదివేల సమూహాలకు ఆతిథ్యమిచ్చే భారతదేశానికి సహనశీలతపై మర్యాదలు నేర్పాల్సిన అవసరం లేదంటూ తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
 
జొరాస్ట్రియన్లు, బహాయిలు, టిబెటన్ బౌద్ధులు, యూదు ప్రజలు శతాబ్దాలుగా భారతదేశంలో సంతోషంగా జీవిస్తున్నారని గుర్తు చేశారు. హిందువుల సంప్రదాయాలు, సంస్కృతిని దుర్వినియోగం చేయడం ద్వారా హిందువులను మతం మార్చడానికి కొంతమంది సువార్త మిషనరీలు ప్రయత్నిస్తున్నారు తప్ప లక్షలాది మంది క్రైస్తవులు సంతోషంగా జీవిస్తున్నారని స్పష్టం చేశారు.
 
కొన్నిసార్లు మైనారిటీలు అసమంజసంగా, ఘర్షణకు గురవచ్చని పేర్కొంటూ  మెజారిటీది కాబట్టి వారు చేసేపనులన్ని ఎల్లప్పుడూ తప్పుడవి కావని, అదే మైనారిటీ కాబట్టి వారు చేసేపనులన్ని ఎల్లప్పుడూ సరైనవి కాబోవని తేల్చి చెప్పారు.
 
 గార్డియన్స్ అనుసరిస్తున్న భారత్ వ్యతిరేక,  హిందూ వ్యతిరేక ధోరణుల కారణంగా బ్రిటన్ లోని  హిందువులపై ద్వేషాన్ని సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. “మేము గార్డియన్‌ను తన తీవ్ర హిందూ వ్యతిరేక విధానాన్ని తగ్గించమని కోరుతున్నాము.  విఫలమైతే మేము నిరసనలు కొనసాగిస్తాము.  వృత్తిపరం కానటువంటి  గార్డియన్ జర్నలిజాన్ని బహిర్గతం చేస్తాము” అంటూ వారు హెచ్చరించారు.
 
సమస్యలపై సంపాదకవర్గాన్ని కలసి తాము సిద్ధంగా ఉన్నామని ప్రవాస భారతీయ ప్రతినిధి నితిన్ మెహతా స్పష్టం చేశారు.